పిల్లలకు ‘బాంబ్‌’,‘గన్‌’ అనే పేర్లు పెట్టాలని ‘కిమ్‌’ ఆదేశం.. లేదంటే భారీ జరిమానా

North Korea Instructs Parents To Name Their Children Bomb Gun - Sakshi

ప్యోంగ్యాంగ్‌: ఉత్తర కొరియా.. ఆ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలన. ఆ దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నం. నిరంకుశ పాలనలో ప్రపంచంతో సంబంధం లేకుండా భిన్నమైన నిబంధనలు పాటిస్తారు. వారికి సొంత క్యాలెండర్‌ ఉంటుంది. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతులు కావాలి. విదేశీ సంగీతం అక్కడ నిషేధం. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కనీసం తల వెంట్రుకలు ఎలా కట్‌ చేసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వమే చెబుతుంది. 

ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కొత్త, విచిత్రమైన నిబంధనను తీసుకొచ్చింది కిమ్‌ సర్కార్‌. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్‌’, ‘శాటిలైట్‌’ వంటి పేర్లను పెట్టాలని కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దేశభక్తి భావాన్ని పిల్లల్లో పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్తర కొరియా ప్రభుత్వం పౌరుల పేర్లను నిర్ణయించటంపై వ్యతిరేకత వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియా మాదిరిగానే.. ఇక్కడా పేర్ల చివర్లలో అచ్చులు ఉండేలా చూడాలని గతంలో సూచించగా.. తాజా నిర్ణయంతో మారిపోయాయి. 

భారీగా జరిమానా..
ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే కుటుంబాలకు భారీగా జరిమానా విధించాలని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు పలు నివేదికలు తెలిపాయి. చెప్పిన విధంగా పేర్లు లేకపోవటం సోషలిస్ట్‌ విధానానికి వ్యతిరేకమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు.. కొత్త పేర్లు దక్షిణా కొరియాలో ఉండే పేర్లకు భిన్నంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

తల్లిదండ్రుల ఆగ్రహం..
తమ పిల్లల పేర్లను బాంబ్‌, గన్‌, శాటిలైట్‌ వంటి వాటితో పెట్టాలని సూచించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆదేశాలను పాటించేందుకు చాలా మంది వ్యతిరేకత చూపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమ పేర్లను మార్చుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఉత్తర కొరియాకు చెందిన ఓ వ్యక్తి రేడియో ఫ్రీ ఆసియా(ఆర్‌ఎఫ్‌ఏ)తో తెలిపాడు. గత ఏడాది నవంబర్‌ నుంచే పేర్ల మార్పునకు సంబంధించిన నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top