మార్పునకు ఓటేసిన న్యూజిలాండ్‌: కొత్త ప్రధానిగా లక్సన్‌ | Sakshi
Sakshi News home page

మార్పునకు ఓటేసిన న్యూజిలాండ్‌: కొత్త ప్రధానిగా లక్సన్‌

Published Sat, Oct 14 2023 4:42 PM

New Zealand election National party's Chris Luxon wins - Sakshi

న్యూజిలాండ్‌ నూతన ప్రధానిగా నేషనల్‌ పార్టీ నేత, మాజీ వ్యాపారవేత్త క్రిస్టోఫర్ లక్సన్ ఎన్నిక కానున్నారు.. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల లెక్కింపు శనివారం కొనసాగుతూండగా లక్సన్‌ నిర్ణయాత్మక విజయం సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలో ఆరేళ్ల క్రితం ఏర్పాటైన ప్రభుత్వ హయాం ముగియనుంది.  గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జెసిండా ఆర్డెర్న్ ఈ ఏడాది జనవరిలో అనూహ్యంగా  ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.  ఆమె నిష్క్రమణ తరువాత విద్యా మంత్రి హిప్కిన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ... ఆయన తొమ్మిది నెలలు మాత్రమే అధికారంలో కొనసాగ గలిగారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ ఓటమిని అంగీకరించడంతో క్రిస్టోఫర్ లక్సన్ ఎన్నిక లాంఛనం కానుంది. న్యూజీలాండ్‌ ప్రజలు ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేసినట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే తమ పార్టీ ఓటమిని అంగీకరించినట్టు హిప్‌కిన్స్ తన మద్దతు దారులకు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఇప్పటివరకూ సహకరించినందుకు ఆయన తన మద్దతుదారులకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇది తాను కోరుకున్న ఫలితం కాదని వ్యాఖ్యానించారు. దీంతో ప్రత్యర్థి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

నేషనల్ పార్టీ 51 సీట్లు, లేబర్ పార్టీ 33, గ్రీన్స్ 13, యాక్ట్ 12, NZ ఫస్ట్ 8 , టె పతి మావోరీ నాలుగు సీట్లు గెలుచు కోవచ్చని న్యూజిలాండ్ హెరాల్డ్ నివేదించింది. మూడింట రెండు వంతుల ఓట్లను లెక్కించగా, లక్సన్ నేషనల్ పార్టీ దాదాపు 40 శాతం ఓట్లను సాధించింది. క్రిస్ లక్సన్ తొలిసారిగా 2020లో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2021 నవంబర్లో ప్రతిపక్ష నాయకుడయ్యారు.

 అత్యంత కీలకమైన ఈ ఎన్నికల ప్రచారంలో మధ్య-ఆదాయ వర్గాలకు పన్నుల తగ్గింపు, నేరాల అణిచివేత లాంటివాటిని లక్సన్ తన ప్రచార అస్త్రాలుగా వాడుకున్నట్టు  తెలుస్తోంది.

కాగా గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జెసిండా  ఆర్డెన్‌ ఈ ఏడాది జనవరిలో అనూహ్యంగా  ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆమె నిష్క్రమణ తరువాత విద్యా మంత్రి హిప్కిన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ... ఆయన తొమ్మిది నెలలు మాత్రమే అధికారంలోకొనసాగ గలిగారు.

ఇదిలా ఉంటే... పలు కారణాలతో న్యూజీలాండ్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సంక్షోభంలో కొనసాగుతోంది. ప్రజల జీవన వ్యయం పెరిగిపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఉక్రెయిన్‌... రష్యాతో యుద్ధం చేస్తూండటం దేశ ఆర్థి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపింది. దీనికి తోడు తీవ్రస్థాయి వరదలు, తుఫాన్లూ పరిస్థితిని మరింత దిగజార్చాయి. 

 
Advertisement
 
Advertisement