
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వెల్లడి
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేసినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఈ మేరకు నోబెల్ కమిటీకి రాసిన సిఫారసు లేఖను ట్రంప్‌కు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం వైట్‌హౌస్‌లోని బ్లూరూంలో నెతన్యాహూతో సమావేశమయ్యారు. ఇరాన్ అణుకేంద్రాలపై ఇటీవల చేపట్టిన భారీ దాడులు, గాజాలో హమాస్‌తో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన వీరి మధ్య చర్చకు వచ్చాయి.
ఇరు దేశాల ఉన్నతాధికారుల సైతం పాల్గొన్నారు. అనంతరం నెతన్యాహూ మీడియాతో మాట్లాడారు. దేశాలు, ప్రాంతాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నందున ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించానన్నారు. వైమానిక దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలంటూ ఇజ్రాయెల్ ఎంతో కాలంగా అమెరికా పాలకులను కోరుతోంది. తాజాగా, ట్రంప్ ఆ కోరిక నెరవేర్చారు. దీంతో, ఆయన పేరును ఇజ్రాయెల్ నోబెల్ కమిటీకి పంపించిందని విశ్లేషకులు అంటున్నారు.