నువ్వో పిచ్చోడివి! నేనే గనుక లేకుంటే.. | Middle East Crisis: Trump-Netanyahu Angry Phone Call Out | Sakshi
Sakshi News home page

నువ్వో పిచ్చోడివి! నేనే గనుక లేకుంటే..

Jun 2 2026 6:56 AM | Updated on Jun 2 2026 8:34 AM

Middle East Crisis: Trump-Netanyahu Angry Phone Call Out

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. యుద్ధం ఆగిపోతోందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. 

లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్, నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. 

“నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను, ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు” అంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కేవలం లెబనాన్‌కే పరిమితం కాకుండా.. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

బీరూట్‌పై దాడి నిలిపివేయించానన్న ట్రంప్
ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరు పక్షాలు కాల్పులు నిలిపేస్తాయి. ఇది శాశ్వతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు.

నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదు
అయితే ట్రంప్ ప్రకటనల తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి సందేహాలకు తావిచ్చాయి. హెజ్బొల్లా తమ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగిస్తే బీరూట్‌లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. “హెజ్బొల్లా ఆగకపోతే మేము కూడా ఆగం” అని నెతన్యాహు ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రశ్నలు తలెత్తాయి.

యుద్ధం తాజా పరిస్థితి
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో ఇరాన్‌పై సైనిక ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా.. ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో వైమానిక, భూదళాల ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఇటీవల బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలు కూడా ఇజ్రాయెల్ లక్ష్యాలుగా మారాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన పెరుగుతోంది.

ఇరాన్ చర్చలకు బ్రేక్?
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడంతో అమెరికాతో జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ మిత్రదేశమైన హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సాధ్యం కాదని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది. అయితే ట్రంప్ మాత్రం మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో చెబుతూనే.. మరో ఇంటర్వ్యూలో “ఆ చర్చలు బోరింగ్‌గా మారాయి. అవి విఫలమైనా నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు” అని వ్యాఖ్యానించారు. ఇంకా “కొంతకాలం మౌనం పాటిస్తే మంచిది” అని కూడా అన్నారు.

వాషింగ్టన్-టెల్‌అవీవ్ మధ్య విభేదాలా?
ఇప్పటివరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు.

మిడిల్‌ఈస్ట్‌ సంక్షోభం ఎటు?
ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటనలు.. మరోవైపు బీరూట్‌పై దాడుల హెచ్చరికలు.. ట్రంప్-నెతన్యాహు మధ్య బహిర్గతమైన విభేదాలు.. ఇరాన్ చర్చల అనిశ్చితి.. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యాన్ని మరో కీలక మలుపు వద్ద నిలబెట్టాయి. ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఈ శాంతి “శాశ్వతం” అవుతుందా? లేక మరో భారీ ఘర్షణకు నాంది పలుకుతుందా? అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement