హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు | Merchant vessels shot at while attempting to cross Strait of Hormuz: Report | Sakshi
Sakshi News home page

హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు

Apr 18 2026 7:11 PM | Updated on Apr 18 2026 7:49 PM

 Merchant vessels shot at while attempting to cross Strait of Hormuz: Report

టెహ్రాన్‌: భారత వాణిజ్య నౌకలు హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో వాటిపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. 

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన రెండు గన్‌బోట్లు జలసంధి దాటుతున్న ఒక ట్యాంకర్‌పై కాల్పులు జరిపాయని బ్రిటిష్ సైన్యం కూడా తెలిపింది. హార్మూజ్‌ను తెరుస్తున్నట్లు ప్రకటన చేసిన ఇరాన్.. ఆ తర్వాత అమెరికా తీరు వల్ల మళ్లీ మూసివేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆ కాసేపటికే కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ కాల్పుల ఘటన ఒమాన్‌కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్‌డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.

షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హార్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్‌ నుంచి స్పష్టత కోరుతున్నాయి.

కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హార్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్‌ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.

రెండో దశ చర్చలకు ఏర్పాట్లు?
ఇరాన్ అధికారులు తెలిపిన ప్రకారం.. సోమవారం ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాలు ఆదివారం ఇస్లామాబాద్‌ చేరుకునే అవకాశముంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడంలో ఆయన పర్యటన సాయపడుతుందని భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై 20 సంవత్సరాల విరామాన్ని అమెరికా ప్రతిపాదించగా, ఇరాన్ మాత్రం 5 సంవత్సరాల విరామాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం.

ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం వచ్చే వారం ముగియనుంది. ఇస్లామాబాద్‌లో ఇటీవల 21 గంటలు చర్చలు కొనసాగాయి. ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి.  

Advertisement
 
Advertisement
Advertisement