కువైట్ కీలక నిర్ణయం: ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు తగ్గింపు | Kuwait cuts government working hours summer power saving | Sakshi
Sakshi News home page

కువైట్ కీలక నిర్ణయం: ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు తగ్గింపు

May 17 2026 1:46 AM | Updated on May 17 2026 1:47 AM

Kuwait cuts government working hours summer power saving

దుబాయ్: వేసవి కాలంలో దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని అదుపు చేయడం, నేషనల్ పవర్ గ్రిడ్‌పై ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే వేసవి నెలల్లో ప్రభుత్వ సంస్థల్లో పని గంటలను రోజుకు ఆరు గంటలకు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటివరకు రోజుకు ఏడు గంటలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలను, ఆరు గంటలకు కుదించాలనే ప్రతిపాదనకు సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. వేసవిలో ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ సమయంలో ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం విపరీతంగా పెరిగి విద్యుత్ నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పీక్ అవర్స్‌లో పవర్ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వ విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ పని వేళల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, విద్యుత్ లోడ్‌ను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పలు కర్మాగారాలు (ఫ్యాక్టరీలు) సైతం గరిష్ట డిమాండ్ ఉన్న సమయాల్లో తమ ఉత్పత్తి కార్యకలాపాలను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది.

మూడు నెలల పాటు అమలు

ఈ తగ్గించిన పని గంటలు వేసవి కాలంలో మూడు నెలల పాటు అమలులో ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలు, కార్యాచరణ యంత్రాంగాన్ని సివిల్ సర్వీస్ కమిషన్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగుల ఫ్లెక్సిబుల్ మార్నింగ్ అటెండెన్స్ విండోను (ఉదయం ఆఫీసుకు వచ్చే సమయం) ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు (ఒక గంటకు మాత్రమే) పరిమితం చేయనున్నారు. అలాగే సాయంత్రం షిఫ్టులు 5 గంటల నుండి ప్రారంభం కానున్నాయి.

మరోవైపు, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నీటిని, విద్యుత్‌ను హేతుబద్ధంగా వినియోగించుకునేలా కువైట్ విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పలు అదనపు చర్యలను కూడా అమలు చేస్తోంది. ఇంధన వనరులను పొదుపుగా వాడుకుంటూ, గరిష్ట వినియోగ సమయాల్లో గ్రిడ్ దెబ్బతినకుండా చూసేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతమైన వినియోగ అలవాట్లను అలవర్చుకోవాలని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement