అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉచితంగా వాక్సిన్‌

Joe Biden Promises Free Corona Vaccine for Everyone - Sakshi

డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ హామీ

కరోనా కట్టడిలో ట్రంప్‌ విఫలమయ్యారని విమర్శ

వాషింగ్టన్‌: తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా వాక్సిన్‌ అందిస్తానని డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ హామీ ఇచ్చారు. తన సొంతరాష్ట్రం డెలావర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..  కరోనాను ట్రంప్‌ కట్టడి చేయలేకపోయారని, అందుకే 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని విమర్శించారు. ట్రంప్‌ కారణంగా ఎకానమీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఆరోపించారు. ట్రంప్‌ చెప్పినట్లు అమెరికన్లు కరోనాతో జీవించడం నేర్చుకోలదని, మరణించడం నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందువల్ల కరోనాకు సురక్షితమైన వాక్సిన్‌ తయారు కాగానే, తాను ఎన్నికయిన తర్వాత అందరికీ ఉచితంగా అందిస్తానని వాగ్దానం చేశారు. అధ్యక్షుడు కాగానే కరోనా వాక్సిన్‌ను కావల్సినన్ని డోసులు కొనేలా ఆదేశాలిస్తానని, అప్పుడే దేశంలో ఇన్సూ్యరెన్స్‌ లేని వాళ్లకు కూడా వాక్సిన్‌ అందుతుందని చెప్పారు. కరోనా ఇప్పట్లో మాయమయ్యే సంకేతాలేమీ కనిపించడం లేదన్నారు.

ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ట్రంప్‌ వద్ద సరైన ప్రణాళికే లేదని దుయ్యబట్టారు. అధ్యక్షుడిగా ఇంకా ట్రంప్‌ కొనసాగితే మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడని విమర్శించారు. అధ్యక్షుడయ్యాక జనవరి కల్లా చట్టసభల్లో కరోనా నివారణ, ఎకానమీ పునరుజ్జీవన సంబంధిత బిల్లులు తీసుకువస్తానని బైడెన్‌ చెప్పారు. ప్రతి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి అక్కడ ప్రజలు మాస్కు తప్పక ధరించేలా చూడమని కోరతానన్నారు. ఒక అధ్యక్షుడిగా అన్ని వేళల్లో మాస్కు ధరించడాన్ని తాను తప్పనిసరి చేస్తానన్నారు. మాస్కు ధరించడం ప్రాణాలు కాపాడుతుందని చెప్పారు. అదేవిధంగా తాను ఎన్నికైతే దేశమంతా వర్తించే ఒక జాతీయ పరీక్షా ప్రణాళిక రూపొందించి అందరికీ టెస్టులు జరిపే ఏర్పాట్లు చేస్తానన్నారు. సైన్సుపై నమ్మకం ఉంచి అందరం కలిసికట్టుగా కదిలితే ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

చదవండి: పెద్దన్న ఎన్నిక ఇలా..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top