కృత్రిమ ‘చెయ్యిచ్చాడు’

Italian dentist presents fake arm for vaccine to get pass - Sakshi

మిలన్‌: ఇటలీలో ఆయనో డెంటిస్టు. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడం సుతారమూ ఇష్టం లేదు. సోమవారం నుంచి దేశంలో ‘సూపర్‌ హెల్త్‌ పాస్‌’ నిబంధన అమల్లోకొస్తోంది. టీకా తీసుకున్న వారికి జారీచేసే ఈ పాస్‌ చూపితేనే సినిమా థియేటర్, రెస్టారెంట్, బార్లు, సాంస్కృతిక వేదికల్లోకి అనుమతిస్తారు. దాంతో 57 ఏళ్ల ఈ డెంటిస్టు అతి తెలివిని ప్రదర్శించాడు. తన చేయిని షర్ట్‌లోపల (ఛాతి భాగానికి కట్టేసుకొని) పెట్టుకుని భుజానికి సిలికాన్‌తో చేసిన కృత్రిమ చెయ్యిని తగిలించాడు. బీయిలా సిటీలో గురువారం టీకా కేంద్రానికెళ్లి టీకా వేయాలని కృత్రిమ చేతి స్లీవ్స్‌ను పైకి లేపాడు.

పరధ్యానంగా నర్సు టీకా వేసేస్తుందని అనుకొన్నాడు. అయితే నర్సు ఫిలిప్పాకు చేయి పట్టుకోగానే అనుమానం వచ్చింది. ‘చర్మం చల్లగా ఉంది. అత్కుక్కుంటోంది. రంగులో తేడా ఉంది. ఒక చెయ్యి ప్రమాదంలో కోల్పోయి ఉంటాడు. పొరపాటున కృత్రిమ చెయ్యి ఇచ్చాడని అనుకొన్నాను. మరో చెయ్యి ఇవ్వమని కోరగా.. ఆయన అసలు నిజం బయటపెట్టాడు. తనకు వ్యాక్సినేషన్‌ ఇష్టం లేదని, పాస్‌ కోసమే ఇలా చేశానన్నాడు’ అని ఫిలిప్పా వెల్లడించారు. ఇటలీలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేయడంతో మనోడు ససేమిరా అంటే... ఇప్పటికే అధికారులు సస్పెండ్‌ చేశారు. పాస్‌ కోసం ఇప్పుడిలా చేసి దొరికిపోయాడు. అతని వివరాలతో ఉన్నతాధికారులకు నర్సు ఫిర్యాదు చేసింది. ఆయనపై క్రిమినల్‌ అభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top