ఇరాన్-అమెరికా శాంతి చర్చల వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు సజావుగా సాగవంటూ ఓపక్క ఇరాన్ కొత్త పాట పాడుతోంది. మరోపక్క ఈ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌పై ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బాహాటంగానే ఇరు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. లెబనాన్ దాడుల విషయంలో ఇజ్రాయెల్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారాయన. ఇజ్రాయెల్ అనే దేశం క్యాన్సర్‌లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపమన్న రీతిలో వ్యాఖ్యానించారు.
‘‘ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. అటు లెబనాన్‌లో అమాయకుల్ని ఇజ్రాయెల్ చంపుతోంది. గాజా, ఇరాన్ తర్వాత.. లెబనాన్‌లో రక్తపాతం కొనసాగిస్తోంది. అలాంటి దేశాన్ని పుట్టించినవాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నా’’ అంటూ సోషల్ మీడియాలో ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే.. ఆసిఫ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరే పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందిస్తూ.. ఇజ్రాయెల్ నాశనం కోరుకుంటున్న పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఏ దేశం ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతించబోదని.. పైగా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇలాంటివి ఊహించలేం అంటూ పేర్కొంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ కూడా పాక్ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ జబ్బుతో పోల్చడం అంటే.. ఒక దేశ నాశనాన్ని కోరుకోవడమేనని, ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం మంచివి కావని అన్నారు.
ఇజ్రాయెల్-పాకిస్తాన్ మధ్య ఏనాడూ అధికారిక సంబంధాలు లేవు. అయితే.. ఇరాన్-అమెరికా యుద్ధంలో చైనాతో పాటు పాక్ మధ్యవర్తిత్వం వహించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వ్యవహారంలో పాక్ పాత్ర ఏమీ ఉండకపోవచ్చని.. అసలు ఆ దేశాన్ని నమ్మడానికే వీల్లేదని ఇజ్రాయెల్ అంటోంది. గతంలో గాజా విషయంలో గల్ఫ్ దేశాల సాయం తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు పాక్‌ను కూడా వాడుకుంటున్నట్లు కనిపిస్తోందని చెబుతోంది. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగాల్సిన టైంలో.. పాక్-ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరంగా మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి.


