ఇజ్రాయెల్-గాజా: ఒక్కరోజులో 704 మంది బలి 

Israel escalates its bombardment in the Gaza Strip - Sakshi

గాజాపై దాడులు ఉధృతం చేసిన ఇజ్రాయెల్‌ సైన్యం

24 గంటల వ్యవధిలో 400 వైమానిక దాడులు  

ఖాన్‌ యూనిస్‌లో 100 మంది ఉంటున్న నాలుగు అంతస్తుల భవనం ధ్వంసం 

32 మంది మృతి..మరికొందరికి గాయాలు   

యుద్ధంలో 6,487కి చేరిన మృతుల సంఖ్య

రఫా/టెల్‌అవీవ్‌/న్యూఢిల్లీ:  గాజారస్టిప్‌లో హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు మరింత ఉధృతం చేసింది. గత 24 గంటల వ్యవధిలో 400 వైమానిక దాడులు నిర్వహించామని మంగళవారం ప్రకటించింది. బాంబు దాడులతో హమాస్‌ స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు హమాస్‌ కమాండర్లు హతమయ్యారని వెల్లడించింది.

కానీ, ఇజ్రాయెల్‌ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలియజేసింది. వీరిలో 305 మంది చిన్నారులు, 173 మంది మహిళలు ఉన్నారని వివరించింది. సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖాన్‌ యూనిస్‌ సిటీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 32 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ భవనంలో 100 మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ఉత్తర గాజా నుంచి వచ్చినవారే.  

గాజాలో 2,055 మంది చిన్నారులు మృతి  
ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో గాజాలో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. ఈ మారణహోమం ఆపేందుకు అంతర్జాతీయ సమాజం వెంటనే చొరవ చూపాలని కోరాయి. సామాన్య ప్రజల ప్రాణాలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని, కాల్పుల విరమణ పాటించాలని, ఘర్షణకు తెరదించాలని ఇజ్రాయెల్‌ సైన్యానికి, హమాస్‌ మిలిటెంట్లకు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం మంగళవారం 18వ రోజుకు చేరుకుంది.

ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా గాజాలో 5,087 మంది మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 2,055 మంది చిన్నపిల్లలు ఉన్నారని పేర్కొంది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా చనిపోయారు. మిలిటెంట్ల అదీనంలో 200 మందికిపైగా బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో గాజాలో సాధారణ నివాస గృహాలు, పాఠశాలలు, మసీదులు నేలమట్టయ్యాయి. ఎటుచూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. గాజాలో 10 లక్షల మందికిపైగా మైనర్లు నిర్బంధంలో చిక్కుకుపోయారని ‘సేవ్‌ ద చిల్డ్రన్’  సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో 27 మంది బాలలు మరణించారని వెల్లడించింది. ఇజ్రాయెల్‌ విచక్షణారహితంగా దాడులు చేస్తోందని, చిన్నారుల్ని బలి తీసుకుంటోందని ఆరోపించింది.  

ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో సేవలు బంద్‌ 
ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడుల వల్ల గాజాలో క్షతగాత్రుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా, మరోవైపు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే మూడింట రెండొంతుల ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఎలాంటి సేవలు అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది.

72 ఆరోగ్య కేంద్రాలకు గాను 46, 35 ఆసుపత్రులకు గాను 12 ఆసుపత్రుల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయని మంగళవారం ప్రకటించింది. ఔషధాలు, విద్యుత్, ఇంధన కొరత కారణంగా క్షతగాత్రులకు సేవలందించలేకపోతున్నామని పాలస్తీనా అరోగ్య శాఖ అంటోంది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో కొన్ని ఆరోగ్య కేంద్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికితోడు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాలో ఆరోగ్య వ్యవస్థ అత్యంత అధ్వాన స్థితికి చేరుకుందని ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.   

బందీల సమాచారం ఇవ్వండి
గాజాపై భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌ ప్రస్తుతానికి వైమానిక దాడులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భూతల దాడులు ప్రారంభమైతే గాజాలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లకి హమాస్‌ మిలిటెంట్లు స్పందిస్తున్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు బందీలను ఇప్పటికే విడుదల చేయగా, సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను విడుదల చేశారు. బందీల సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచిస్తూ ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో కరపత్రాలు జారవిడిచింది. సమాచారం అందజేసేవారికి ఆపద రాకుండా కాపాడుతామని హామీ ఇచ్చింది. 

నిండిపోయిన శ్మశాన వాటికలు  
ఇజ్రాయెల్‌–హమాస్‌ ఘర్షణ ప్రారంభమైన తర్వాత గాజాలో 14 లక్షల మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. వీరిలో దాదాపు 5.80 లక్షల మంది ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోకి ఆహారం, ఇతర సహాయక సామాగ్రిని అనుమతిస్తున్న ఇజ్రాయెల్‌ పెట్రోల్, డీజిల్‌ను మాత్రం అనుమతించడం లేదు. గాజాలో మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ఒకే సమాధిలో ఐదు మృతదేహాలను ఖననం చేస్తున్నారు. పాత సమాధులను తవ్వేసి, కొత్త మృతదేహాలను సమాధి చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top