యుద్ధమైనా.. శాంతి చర్చలైనా.. మేం ఒక్కటే | Iran urges US to honour ceasefire | Sakshi
Sakshi News home page

యుద్ధమైనా.. శాంతి చర్చలైనా.. మేం ఒక్కటే

Apr 16 2026 9:07 AM | Updated on Apr 16 2026 9:23 AM

Iran urges US to honour ceasefire

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా గౌరవించి తీరాల్సిందేనని పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అయినా.. శాంతి చర్చలైనా..  ఇరాన్, దాని మిత్ర శక్తులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయని స్పష్టం చేశారు. 

హెజ్బొల్లా ధైర్యం, రెసిస్టెన్స్ ఐక్యత వల్లే లెబనాన్‌లో కాల్పుల విరమణను సాధ్యమైందని అన్నారాయన. యుద్ధం జరిగినా, శాంతి ఒప్పందం వచ్చినా.. ఇరాన్, రెసిస్టెన్స్(మిత్ర శక్తుల) శక్తులు ఒక్కటిగానే ఉంటాయని.. ఈ శక్తులు కలకాలం ముందుకు సాగుతాయన్నారు. అలాగే.. ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే పనిగా పెట్టుకున్న అమెరికా ఆ విధానాన్ని వదిలేయాలని సూచించారు. శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని అమెరికాకు హితవు పలికారు. 

హర్ముజ్ జలసంధి అమెరికా దిగ్బంధనం(బ్లాకేడ్‌) కొనసాగుతోంది. ఈ చర్య అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మరోసారి అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చింది. ఈ జోక్యాన్ని చూస్తూ ఊరుకోబోమని చెబుతోంది. 

లెబనాన్‌లో కాల్పుల విరమణ ఇంకా ఆచరణలోకి రాలేదు. అమెరికా మధ్యవర్తితత్వంతో ఇజ్రాయెల్‌-లెబనాన్‌ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తగ్గినా.. చిన్నపాటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఘలీబాఫ్ వ్యాఖ్యలు పశ్చిమాసియా సంక్షోభంలో రెసిస్టెన్స్ శక్తుల ఐక్యతను బలపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరాన్‌ చెబుతున్నట్లు.. అమెరికా గనుక ఇజ్రాయెల్‌ ఫస్ట్‌ విధానాన్ని వీడి శాంతి ఒప్పందాన్ని గౌరవించకపోతే ప్రాంతీయ స్థిరత్వం మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంది. 

ఇక అమెరికా ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు త్వరలో మళ్లీ ఇస్లామాబాద్‌లోనే జరగనున్నాయి. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో.. ఎవరో ఒకరు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అటు అమెరికా.. ఇటు ఇరాన్‌ తగ్గేదే లే అంటున్నాయి. బంతి ఇరాన్‌ కోర్టులోనే ఉందని అమెరికా అంటుంటే.. తమ డిమాండ్లలో ఏ ఒక్కటి తగ్గినా చర్చలు ముందుకు సాగవని ఇరాన్‌ అంటోంది. పాక్‌ మధ్యవర్తిత్వంలో తొలుత ఇరాన్, అమెరికా ప్రతినిధులు పరోక్ష చర్చలు జరుపుతారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే ప్రత్యక్ష చర్చలు జరగొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement