టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని వాటిని ఆపే వరకూ ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవని తేల్చి చెప్పింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఈ కథనాలను ప్రచురితం చేసింది.
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న నానుడి ఇప్పుడు ఇరాన్- అమెరికా యుద్దంలో సరిగ్గా సరిపోతుంది. శాంతి చర్చలు ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తోన్నా చర్చలలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఓసారేమో అమెరికా మెుండి చేయడం.. మరోసారేమో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం ఇదే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి శాంతి చర్చలను వాయిదా వేస్తోన్నట్లు ఇరాన్ ప్రకటించింది.
గాజా,లెబనాన్‌లలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, అలాగే లెబనీస్ భూభాగం నుండి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై తమ డిమాండ్లు, తమ మిత్రదేశాల డిమాండ్లు నెరవేరే వరకు చర్చలు పునఃప్రారంభం కావని తెలిపింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది.
కాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్‌లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టుపక్కల కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 26 ఏళ్లలో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే అతిపెద్దది. కాగా లెబనాన్‌పై ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు.


