
ఇరాన్ సుప్రీం నేత ఖమేనీపై మొస్సాద్ వ్యాఖ్యలు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ సంబంధ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్ సుప్రీం నేత అయెతొల్లా ఖమేనీ గురించి తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఖమేనీ పాలనకు తగిన వ్యక్తి కారని, డ్రగ్స్‌కు బానిసై ఎప్పుడూ మత్తులోనే జోగుతుంటారని ఆరోపించింది. పర్షియన్ భాషలోని ఈ అకౌంట్‌ను @Mossad Spokesman గా గుర్తించారు. ఇది ‘మొస్సాద్ ఫార్సి’గా కూడా పేరుతెచ్చుకుంది.
అచ్చు మొస్సాద్ అధికార చానెల్ అకౌంట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇరాన్ లక్ష్యంగా ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇరాన్‌కు ఇబ్బంది కలిగించేలా ఆ దేశ ప్రభుత్వ రహస్య సమాచారం వంటివి ఇందులో కనిపిస్తుంటాయి. అంతేకాదు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల గురించిన రహస్య క్విజ్ పోటీలను సైతం ఈ అకౌంట్ నిర్వహిస్తుంటుంది.
శుక్రవారం @MossadSpokesman ఎక్స్ అకౌంట్‌లో..‘రోజులో సగం నిద్రకు, మరో సగం డ్రగ్స్‌కు బానిసై గడిపే వ్యక్తి దేశాన్ని ఎలా నడపగలరు?..నీళ్లు, కరెంటు, జీవితం’అంటూ పేర్కొంది. అయితే, ఇందులో ఖమేనీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇరాన్‌లో కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, విద్యుత్ కొరతలతోపాటు నిత్యం కనిపించే ప్రజాందోళనలను పరోక్షంగా పేర్కొంది. ఈ పోస్టుకు 48 గంటల్లోనే 1.80 లక్షల మంది స్పందించారు.
గత నెలలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య 12 రోజులపాటు కొనసాగిన సంక్షోభం సమయంలో ఈ అకౌంట్‌లో ఇరాన్ నూతన సైనిక కమాండర్ ఎవరో చెప్పాలంటూ సవాల్ విసరగా ఒక వ్యక్తి కచ్చితమైన పేరును వెల్లడించడం విశేషం. ఈ అకౌంట్‌లో గతంలోనూ ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులే ఉండేవి. డ్రగ్స్ వాడే వారు నాయకత్వం వహించగలరా అంటూ ప్రశ్నించింది.
ఇందులో ప్రత్యేకంగా అయెతొల్లా ఖమేనీ పేరును ప్రస్తావించనప్పటికీ ఆ తీవ్రత, కంటెంట్‌ను బట్టి ఇరాన్ సుప్రీం లీడరే టార్గెట్ అన్న విషయం తేలిగ్గా ఎవరికైనా అర్థమవుతుంది. పర్షియా భాషలో ఉన్న ఈ పోస్టులను ఆటో–ట్రాన్స్‌లేషన్‌తో అందరూ చదవొచ్చు. ఈ అకౌంట్ తమదేనంటూ ఇజ్రాయెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఇరాన్ ప్రజలే లక్ష్యంగా మొస్సాద్ నిర్వహించే మెసేజింగ్ చానెల్‌గానే చెబుతుంటారు.
ఆపరేషన్ రైజింగ్ లయన్ వేళ...
గత నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన వేళ ఈ అకౌంట్ వచ్చిన ఒక పోస్టు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇజ్రాయెల్ చేసిన మొట్టమొదటి దాడిలో ఇరాన్‌కు చెందిన ఘొలాం అలీ రషీద్ అనే మిలటరీ కమాండర్ చనిపోయారు. ఆ వెంటనే అలీ షాద్మానీ అనే ఆయన వారసుడు సైతం మృతి చెందారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన కమాండర్ పేరును ఇరాన్ రహస్యంగా ఉంచింది.
ఈ అంశంపై @Mossad Spokesman రెచ్చగొట్టే రీతిలో స్పందించింది. ఆ కమాండర్ ఎవరో తనకు తెలుసునంటూ, కొత్తగా నియమితులైన కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లకు క్విజ్ పెట్టింది. ‘ఇరాన్ ప్రభుత్వం ఖతమ్ అల్ అన్బియాకు కొత్త కమాండర్‌ను నియమించింది. భద్రత కోసం ఆయన పేరును వెల్లడించలేదు. మాకు అతడెవరో తెలుసు, అతడితో ఉండే వారి పేర్లూ తెలుసు.
దురదృష్టవశాత్తూ ఇటువంటి విషయాలను ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. ఆ కొత్త కమాండర్ పేరు తెలిస్తే దయచేసి చెప్పండి’అని కోరింది. దీనికి 2,300 మంది స్పందించారు. ఖమేనీ కుమారుడు మొజ్‌తబా ఖమేనీ తదితర పేర్లను కొందరు ఊహించి చెప్పగా మరికొందరు మాత్రం తిట్టిపోశారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సోషల్ మీడియా యూజర్ బెహ్నమ్ గొలిపౌర్ మాత్రం కొత్త కమాండర్ పేరు అలీ అబ్దొల్లాహి అలియాబాది అంటూ కరెక్ట్‌గా గెస్ చేశారు. అతడి పేరును ప్రకటించిన మొస్సాద్ అకౌంట్..వ్యక్తిగతంగా తమను కలిసి, బహుమతి అందుకోవాలని కోరింది.