మీరు నిజాయితీగా.. ట్రంప్‌కు వ్యతిరేకంగా | Iran praises Tulsi Gabbard after resignation, 'You spoke truth' | Sakshi
Sakshi News home page

మీరు నిజాయితీగా.. ట్రంప్‌కు వ్యతిరేకంగా

May 23 2026 2:49 PM | Updated on Jun 18 2026 3:20 PM

Iran praises Tulsi Gabbard after resignation, 'You spoke truth'

టెహ్రాన్‌: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చంతా.. అమెరికా DNI డైరెక్టర్‌ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేయడంపైనే నడుస్తోంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? లేక తనంత తానే తప్పుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌.... తులసీ గబ్బార్డ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

అమెరికాకు అత్యత  కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్‌ (DNI) పదవికి తులసి గబ్బార్డ్‌  రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్‌కు అరుదైన ఎముక క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్‌ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే తలసీ గబ్బార్డ్‌ రాజీనామా ఇప్పుడు అంతర్జాతీయంగా పలు చర్చలకు దారితీసింది. దీనిపై తాజాగా అర్మేనియాలోని ఇరాన్‌ ఎంబసీ స్పందించింది.

ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో " అబ్రహాం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ కోసం కాకుండా అమెరికా కోసం పనిచేస్తారని నిరూపించుకున్నారు, అదే విధంగా పలుమార్లు అధ్యక్షుడు ట్రంప్ ద్వేషించే ఇరాన్ గురించిన నిజాలను కూడా నిష్పక్షపాతంగా మాట్లాడారు. అమెరికాను పక్కనపెట్టి, ఇజ్రాయెల్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో మీలాంటి వ్యక్తి పనిచేయడం విచారకరం. మీకు శుభాకాంక్షలు" అని ఎక్స్‌ఖాతాలో రాసుకొచ్చింది.

అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని వ్యక్తులు ఆ దేశం కోసం కాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్‌ కోసం పనిచేస్తున్నారని ఎంబసీ ఆరోపించింది. అంతే కాకుండా ఆ దేశ ‍ప్రయోజనాల కోసం తులసి గబ్బార్డ్‌ ట్రంప్‌కు సైతం కోపం తెప్పించేలా పలుసార్లు మాట్లాడిందని పేర్కొంది.

అమెరికా మీడియా కథనాలు 
అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్‌ టీమ్‌లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్‌ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్‌హౌస్‌లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.

ప్రత్యేకించి.. ఇరాన్‌ విషయంలో తులసి గబ్బార్డ్‌ వైఖరి మొదటి నుంచి ట్రంప్‌ లైన్‌కు భిన్నంగా కనిపించింది. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్‌ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌సైతం ఆమెకు మద్ధతుగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement