ఇంటికి నిప్పు పెట్టి ఆర్పుతున్నట్లు నటన

India Young Diplomat Sneha Dubey Gives Blistering Reply To Pakistan - Sakshi

పాకిస్తాన్‌వన్నీ కపట నాటకాలు

ఐరాస వేదికగా గట్టిగా బదులిచ్చిన స్నేహ దుబే

స్నేహను ఆకాశానికెత్తేస్తున్న సోషల్‌ మీడియా

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో భారత యువదౌత్యవేత్త స్నేహ దుబే పాకిస్తాన్‌ నోరుమూయించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నెటిజన్లు ఆమె ప్రసంగంలో పటిమకు జేజేలు కొడుతున్నారు. యూఎన్‌ వేదికపై పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగానికి స్నేహ గట్టిగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్‌ ప్రధాని భారత్‌ అంతర్గత విషయాలను ప్రస్తావించారు. అవాస్తవాలు ప్రచారం చేయడానికి అంతర్జాతీయ వేదికపై విషం చిమ్మడం ఇది మొదటిసారి కాదు.

పదే పదే తానే ఉగ్రవాద బాధిత దేశమని పాక్‌ చెప్పుకుంటుంది. తనే ఇంటికి నిప్పు పెట్టి, మళ్లీ దానిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూ ఉం టుంది. పాక్‌ విధానాలతో యావత్‌ ప్రపంచం ఇ బ్బందులు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌లో ఉగ్రవా దులు చాలా స్వేచ్ఛగా తిరుగుతారు. ఆ దేశం ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి, వారికి నిధులు సమకూ ర్చి పెంచి పోషిస్తోంది. ఒసామా బిన్‌ లాడెన్‌ లాంటి వారికి ఆశ్రయం ఇచ్చింది’’అని ఫస్ట్‌ సెక్రటరీ స్నేహ దుబే దుయ్యబట్టారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తన సందేశాన్ని వీడియో ద్వారా పంపించిన పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ మృతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ భారత్‌లో ఇస్లాం వ్యతిరేకులు పరిపాలకులుగా ఉన్నారని, ముస్లిం లపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దీనికి స్నేహ దుబే సమాధానమిస్తూ జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ తక్షణమే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్‌ జారీ చేశారు.

ఎవరీ స్నేహ దుబే?
స్నేహ దుబే తన 12 ఏళ్ల వయసు నుంచే దేశానికి ప్రాతినిధ్యం వహించి విదేశాలు చుట్టి రావాలని కలలు కన్నారు. ఆమె కన్న కలకి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైంది. గోవాలో పాఠశాల విద్య అభ్యసించారు. ఉన్నత విద్య పుణెలో చదివారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎంఫిల్‌ చేశారు. 2011లో యూపీఎస్సీకి మొదటి ప్రయత్నంలోనే పాసయ్యారు. అంతర్జాతీయ వ్యవహారాలు, విభిన్న సంస్కృతులు తెలుసుకోవడంపై మక్కువ ఎక్కువ. ప్రయాణాలంటే ఆసక్తి ఉన్న ఆమె ఫారెన్‌ సర్వీసులో చేరితే ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చునని ఆశపడ్డారు. దానికి తగ్గట్టే ఆమెకి అవకాశం వచ్చింది. మొదట విదేశాంగ శాఖలో పని చేసిన స్నేహ ప్రస్తుతం ఐరాసలో భారత్‌ ఫస్ట్‌ సెక్రటరీగా ఉన్నారు.

భారత్‌లో ఫాసిస్ట్‌ ప్రభుత్వ పాలన
పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా ధోరణితో తమకు ఎంతో నష్టం జరిగిందని ఐక్యరాజ్య సమితి వేదికగా చెప్పారు. అమెరికా కనీస కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం, అంతర్జాతీయ సమాజం ద్వంద్వ ప్రమాణాలతో తమ దేశం ఎన్నో ఇబ్బందులు పడిందన్నారు. ముందుగా రికార్డు చేసిన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగం వీడియోను శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రదర్శించారు. వాతావరణ మార్పుల దగ్గర నుంచి ఇస్లాం వ్యతిరేకత వరకు ఎన్నో అంశాలపై ఆయన మాట్లాడారు. భారత్‌ని పదునైన మాటలతో తూలనాడారు. భారత్‌లో మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అభివర్ణించారు. ఇస్లాం వ్యతిరేక ధోరణితో విషం కక్కుతోందని ఆరోపించారు. అఫ్గాన్‌లో పరిణామాలతో పాకిస్తాన్‌ను అందరూ దోషిగా చూస్తున్నారని అన్నారు. ‘అమెరికాపై సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత ఉగ్రవాదులపై జరిపిన యుద్దంలో ఆ దేశంతో చేతులు కలిపి మేమే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అఫ్గానిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌కి ఎక్కువ నష్టం జరిగింది’’అని పేర్కొన్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top