రాత్రికి రాత్రే.. బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై విధ్వంసకాండ, ముస్లిం సంఘాల ఖండన

Hindu Temples Vandalised In Bangladesh - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై గుర్తుతెలియని దుండగులు విధ్వంస కాండకు తెగబడ్డారు. రాత్రికి రాత్రే పక్కా ప్రణాళికలతో విరుచుకుపడి.. థకూర్‌గావ్‌ రీజియన్‌ పరిధిలో ఉన్న 14 ఆలయాలను ధ్వంసం చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. 

చీకట్లను ఆసరాగా చేసుకుని.. రీజియన్‌ పరిధిలోని మూడు చోట్ల ఉన్న హిందూ దేవాలయాలపై కొందరు ఆగంతకులు దాడులకు తెగబడ్డారు. సుమారు 14 చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని బలియాదంగికు చెందిన హిందూ కమ్యూనిటీ నేత వైద్యనాథ్‌ బర్మన్‌ వెల్లడించారు. కొన్ని చోట్ల విగ్రహాలను పగలకొట్టారని, మరికొన్ని చోట్ల విగ్రహాలను పెకలించి.. దగ్గర్లో ఉన్న కొలనులో పడేశారని  తెలిపారాయన. 

గతంలో ఇలాంటి ఘటనలు ఏం జరగలేదని.. అక్కడున్న ముస్లిం ప్రజలు కూడా స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారని.. కానీ, ఏనాడూ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని యూనియన్‌ పరిషత్‌ చైర్మన్‌ సమర్‌ ఛటర్జీ తెలిపారు.  శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం మధ్య ఈ దాడులు కొనసాగాయని బలియాదంగీ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, దాడి వెనుక కారణాలను రాబట్టాల్సి ఉందని స్థానిక పోలీసులు చెప్తున్నారు.

మరోవైపు ఈ దాడులను ముస్లిం సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అన్నదమ్ముల్లాగా మెదులుతున్న తమ మధ్య చిచ్చుపెట్టే యత్నం చేసిన వాళ్లెవరినీ వదలకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు ముస్లిం సంఘాల పెద్దలు.  ప్రశాంతంగా ఉన్న చోట.. అల్లకల్లోలం సృష్టించేందుకే దాడులు జగిరి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు థాకూర్‌గావ్‌ పోలీస్‌ చీఫ్‌ జహంగీర్‌ హోస్సేన్‌. దుండగులు ఎవరైనా సరే.. కఠిన చర్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లోని హిందూ ఆలయాలపై ఈ మధ్యకాలంలో దాడులు జరిగిన సంగతి తెలిసే ఉంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top