రష్యా, హమాస్ ఒక్కటే: బైడెన్

Hamas And Russian President Vladimir Putin Are Common Aim - Sakshi

న్యూయార్క్‌: హమాస్, రష్యా ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి అమెరికా ముందుంటుందని చెప్పారు. హమాస్, పుతిన్ వేరువేరు బెదిరింపులకు పాల్పడుతారు.. కానీ వారిరువురి లక్ష్యం ఒకటేనని దుయ్యబట్టారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

'ప్రపంచ పెద్దగా విచ్చిన్నకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోము. హమాస్, పుతిన్ వంటి ఉగ్రవాద సంబంధ శక్తులను గెలవనీయబోము. వారి లక్ష్యాలను ఎప్పటికీ నేను అంగీకరించను. ప్రపంచాన్ని అమెరికా ఐక్యంగా ఉంచుతుంది. మన భాగస్వాములే అమెరికాను సురక్షితంగా ఉంచుతారు. మన విలువలు ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా ఉంటాయి.' అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి నిధులను మంజూరు చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను అభ్యర్థించారు. ప్రపంచ నాయకునిగా ఉండటానికి ఈ నిధులే పెట్టుబడులని అన్నారు. ప్రపంచానికి అమెరికానే దీపపు స్తంభం అని చెప్పారు. 

ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమాసియాలో పర్యటించి వచ్చారు. కల్లోల పరిస్థితులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రపంచ అగ్రనేతగా తన ప్రాబల్యాన్ని చూపుతూ అమెరికా ఎన్నికల్లో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నంలో బైడెన్ ఉన్నారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌లకు రూ.83,1,720 కోట్లు సహాయంగా ఇవ్వడానికి అమెరికా కాంగ్రెస్‌ను ఇప్పటికే అభ్యర్థించారు.

హమాస్‌-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్‌లో నోవా పండుగ వేళ హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. ఇజ్రాయెల్ తిరగబడి ధీటుగా బదులిస్తోంది. గాజాను ఖాలీ చేయించాలనే లక్ష‍్యంతో ముందుకు వెళుతోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో ఇప్పటికే దాదాపు 5000 వేలకు పైగా మంది మరణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతునిస్తోంది. అటు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిక్రితం నుంచి కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: Israel-Hamas conflict: ఇజ్రాయెల్‌ ప్రతీకారేచ్ఛ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top