ఈయూలో టీకా షురూ

European Union nations eagerly kick off mass Covid-19 vaccinations - Sakshi

డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ డోసు

లండన్‌/రోమ్‌: ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ)లో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు ఇచ్చారు. వీరికి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈయూలో 27 సభ్య దేశాలు ఉండగా, జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు ఒకరోజు ముందే అంటే శనివారం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి.

కరోనా బారినపడే ప్రమాదం అధికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. స్పెయిన్‌లో 96 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. చెక్‌ రిపబ్లిక్‌ ప్రధానమంత్రి అండ్రెజ్‌ బబీస్‌ కూడా ఆదివారం వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జర్మనీలో 101 ఏళ్ల మహిళ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈయూలో ఇప్పటివరకు 1.60 కోట్ల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3,36,000 మంది బాధితులు మరణించారు.   

వారికే మొదటి ప్రాధాన్యత..
ఆక్స్‌ఫర్డ్, అస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గురువారంలోగా యూకే ప్రభుత్వం అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల మందికి తొలుత వ్యాక్సిన్‌ అందజేస్తామని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం తెలిపింది.

ఒక్కో డోసు కేవలం 2 పౌండ్లు
 ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలోనే ఆక్స్‌ఫర్డ్‌/అస్ట్రాజెనెకా టీకా కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలిందని అస్ట్రాజెనెకా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాస్కాల్‌ సొరియొట్‌ చెప్పారు. కరోనా బాధితులపై 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని, ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చు. ధర ఒక్కో డోసుకు కేవలం 2 పౌండ్లు.  10 కోట్ల ఆక్స్‌ఫర్డ్‌/అస్ట్రాజెనెకా టీకా డోసుల కోసం యూకే ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది.  మార్చికల్లా 4 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top