
సాధారణంగా కవల పిల్లలు అనగానే.. దాదాపు ఒకే పోలికలతో ఉంటారనే మనకు తెలుసు. కలిసి పుట్టినా ఒకే పోలికలతో లేనివారూ ఉంటారు. కానీ ఒకే పోలికలతో పుట్టినా.. పూర్తి భిన్నంగా కనిపించే కవలలు మీకు తెలుసా? ఇటీవలే ఇంగ్లండ్‌లోని నాటింగ్హమ్ నగరంలో ఇలాంటి అరుదైన కవలలు పుట్టారు. నాటింగ్హమ్‌కు చెందిన చంటెలీ బ్రాటన్ అనే మహిళ ఏప్రిల్ నెలలో కవలలకు జన్మనిచ్చింది.
వారిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. అబ్బాయికి అయాన్ అని, అమ్మాయికి అజిరా అని పేర్లు పెట్టుకుంది. పుట్టినప్పుడు ఇద్దరూ దాదాపు ఒకే పోలికలతో ఉన్నారు. కానీ కొన్ని నెలలు గడిచేసరికి తేడా కనిపించడం మొదలైంది. అయాన్ ఆకుపచ్చ రంగు కళ్లతో, తల్లిని పోలినట్టు తెల్లని చర్మంతో ఉండిపోగా.. అజిరా మాత్రం గోధుమ రంగు కళ్లతో, చర్మం నలుపు రంగులోకి మారిపోవడం మొదలైంది.
చాంటెలీ భర్త ఆస్టన్ తల్లిదండ్రుల్లో ఒకరు నల్లజాతికి చెందిన జమైకన్‌కాగా, మరొకరు స్కాట్లాండ్‌కు చెందినవారు. ఇక చాంటెలీ తాత కూడా నైజీరియాకు చెందిన వ్యక్తేనట. పిండం ఏర్పడినప్పుడు ముందటి తరాల జన్యువులు యాక్టివేట్ అయి ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది ఎంత అరుదైన ఘటన అంటే.. అసలు కవలల జననాలే తక్కువైతే, అందులోనూ ప్రతి పది లక్షల కవలల్లో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.