ఇలాంటి ఓ అంతర్యుద్ధం జరుగుతోందని తెలుసా? | Did You Know About This Civil War Its Not Between Humans | Sakshi
Sakshi News home page

ఇలాంటి ఓ అంతర్యుద్ధం జరుగుతోందని తెలుసా?

Apr 25 2026 1:53 PM | Updated on Apr 25 2026 1:57 PM

Did You Know About This Civil War Its Not Between Humans

మనుషుల చరిత్రలో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తరచుగా కనిపిస్తాయి. రాజ్యాల కోసం, మతాల కోసం, జాతుల కోసం జరిగిన ఈ పోరాటాలు సమాజాలను శాశ్వతంగా మార్చేశాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఇలాంటి అంతర్యుద్ధాలు జరుగుతాయని.. వాటి ఫలితంగా 11 ఏళ్లుగా నిత్యం కారడవిలో రక్తపాతం జరుగుతోందని మీకు తెలుసా?.. 

ఉగాండాలోని కిబాలే నేషనల్‌ పార్క్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద చింపాంజీ సమూహంగా పేరుగాంచిన న్గోగో(Ngogo) కమ్యూనిటీకి కేరాఫ్‌. సాధారణంగా చింపాంజీలు 50 లోపే ఒక సమూహంగా ఉంటాయి. కానీ, న్గోగో జాతివి మాత్రం 200లకు పైనే కలిసి ఉండేవి. ఇది పరిశోధకులను ఎంతో ఆశ్చర్యపరిచేది. ఒకప్పుడు కలిసే ఉంటూ.. కలిసే వేటాడుతూ.. కాలం వెల్లదీస్తుంటాయివి. అలాంటిది ఓరోజు అనూహ్యమైన పరిస్థితి చోటు చేసుకుంది. 

ఉన్నట్లుండి.. ఆ చింపాంజీ గ్రూప్‌ రెండుగా విడిపోయింది. ఒకదానితో మరొకటి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా అది ఘర్షణలకు దారి తీసింది. మనుషుల్లాగే.. అవి గ్యాంగ్‌ వార్‌లు చేస్తుండడం, పక్కా ప్లానులతో ప్రత్యర్థులు దాడులు చేయడం ఆశ్చర్యం కలిగించాయి. చివరకు వాటిలో అవి కొట్టుకుని చంపుకునే దాకా వెళ్లింది పరిస్థితి. 

అలా.. 2015 నుంచి ఇప్పటిదాకా ఏడు పెద్ద చింపాజీలు, మరో 17 పిల్ల చింపాంజీలు మరణించాయి. మరో 14 చింపాంజీలు జాడ లేకుండా పోయాయి.  ప్రస్తుతం వెస్టర్న్‌ గ్రూప్‌, సెంట్రల్‌ గ్రూప్‌ల మధ్య అంతర్యుద్ధంతో నిత్యం కిబాలేలో రక్తం చిందుతోంది. 

ప్రఖ్యాత పరిశోధకుడు ఆరన్‌ సాండెల్‌ ఈ సంఘటనను “చింపాంజీల సివిల్‌ వార్‌”గా అభివర్ణించారు. 2014లో ఆ కమ్యూనిటీని అదుపు చేసిన కొన్ని చింపాజీలు వ్యాధులతో చనిపోవడం.. కొత్త ‘ఆల్ఫా మేల్‌’ రావడం వల్ల సంబంధాలు బలహీనపడ్డాయని చెబుతున్నారాయన. ఆయన మాటల్లో.. ఇది మనుషుల మధ్య మతం, జాతి కోసం జరుగుతున్న యుద్ధంలా కాదు. సంబంధాలు, ఆధిపత్యం, సామాజిక బంధాలు బలహీనపడటం వల్లే చింపాంజీల మధ్య విభజన జరిగింది అని అభిప్రాయపడ్డారు. 

ఈ సంఘటనను 70వ దశకంలో జేన్‌ గూడాల్‌ గోంబే నేషనల్‌ పార్క్‌(టాంజానియాలోని అతి చిన్న నేషనల్‌ పార్క్‌)లో జరిగిన “ఫోర్‌ ఇయర్‌ వార్‌”తో పోలుస్తున్నారు. అప్పట్లో కూడా ఒకే సమూహంలో పెరిగిన చింపాంజీలు.. కహామా, కసకెలా కమ్యూనిటీలుగా విడిపోయి చంపుకున్నాయి. అయితేనీ వైరంతో తక్కువ కాలంలోనే ఆ జాతి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. 

న్గోగో చింపాంజీల యుద్ధం ఎలా ముగుస్తుందో పరిశోధకులకు అంతుచిక్కడం లేదు. ఇక్కడ మూడు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి.. సెంట్రల్‌ గ్రూప్‌ తమను తాము బలపరుచుకుని రక్షించుకోవడం. రెండోది.. వెస్టర్న్‌ గ్రూప్‌ పూర్తిగా ఆధిపత్యం సాధించి సెంట్రల్‌ గ్రూప్‌ను అంతమొందించడం. మూడోది.. రెండు గ్రూపులు మళ్లీ కలిసిపోవడం. అయితే చివరిది చాలా అరుదుగా జరిగే అవకాశం అని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement