Delta Variant Worldwide Spread: కరోనా వేరియంట్లపై ‘డెల్టా’దే ఆధిపత్యం

Delta variant to become dominant strain of COVID-19 in coming months - Sakshi

ఇప్పటికే దాదాపు 100 దేశాల్లో వ్యాప్తి

రాబోయే నెలల్లో డామినెంట్‌ వేరియంట్‌గా డెల్టా

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ఐరాస/జెనీవా:  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో కోవిడ్‌–19 వైరస్‌ డెల్టా వేరియంట్‌ వ్యాప్తిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తెలియజేసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ వేరియంట్‌ రాబోయే రోజుల్లో ఆధిపత్య (డామినెంట్‌) వేరియంట్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2021 జూన్‌ 29 నాటికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు బయటపడ్డాయని తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని పేర్కొంది. కరోనా వేరియంట్లను గుర్తించేందుకు అవసరమైన సీక్వెన్సింగ్‌ కెపాసిటీ చాలా దేశాల్లో పరిమితంగానే ఉందని వివరించింది.

డెల్టా రకం కరోనా వల్ల పాజిటివ్‌ కేసులతోపాటు ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య పెరుగుతోందని వివరించింది. డెల్టా వ్యాప్తి తీరును గమనిస్తే ఇది రాబోయే కొన్ని నెలల్లో ఇతర అన్ని కరోనా వేరియంట్లను అధిగమించే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ విషయంలో ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలు, అమలు చేస్తున్న చర్యలు డెల్టాతో సహా ఆందోళనకరమైన వేరియంట్ల(వీఓసీ) నియంత్రణకు సైతం చక్కగా ఉపయోగపడుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్ల డించింది. ఆందోళనకరమైన వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోందంటే అర్థం నియంత్రణ చర్యలను దీర్ఘకాలం కొనసాగించడమేనని తేల్చిచెప్పింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించింది.

నియంత్రణ చర్యలను గాలికొదిలేయడం వల్లే..
ఇప్పటివరకు గుర్తించిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అడానోమ్‌ ఘెబ్రెయెసుస్‌ గతవారమే ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్న దేశాల్లో ఇది అమిత వేగంతో వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ పరిణామం పట్ల ప్రపంచ దేశాలతోపాటు తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని దేశాలను కరోనా ఆంక్షలను సడలించాయని, నియంత్రణ చర్యలను గాలికొదిలేశాయని, దీనివల్లే ప్రమాదకర వేరియంట్లు పంజా విసురుతున్నాయని పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం.. అల్ఫా వేరియంట్‌ కేసులు 172 దేశాల్లో బయటపడ్డాయి. బీటా వేరియంట్‌ ఉనికి 120 దేశాల్లో వెలుగు చూసింది. ఇక గామా వేరియంట్‌ 72 దేశాల్లో, డెల్టా వేరియంట్‌ 96 దేశాల్లో వ్యాప్తి చెందుతున్నాయి.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top