అన్నం పెట్టలేక... బిడ్డలనే అమ్మేస్తున్నారు! | Sakshi
Sakshi News home page

అన్నం పెట్టలేక... బిడ్డలనే అమ్మేస్తున్నారు!

Published Sun, Jan 30 2022 4:49 AM

Afghan Children Starving To Death As Hunger Rapidly Spreading - Sakshi

డొక్కలీడ్చుకుపోయి.. ఎముకలపై చర్మం మాత్రమే ఉన్న చిన్నారులు... కుటుంబాన్ని బతికించుకునేందుకు శరీర అవయవాలను అమ్ముకుంటున్న పెద్దలు..  మిగిలిన బిడ్డలను బతికించుకోవడానికి ఓ బిడ్డను అమ్ముకుంటున్న కుటుంబాలు... పుట్టెడు దు:ఖాన్ని దాచేసి ఏ భావమూ కనిపించకుండా నిర్విరాకరంగా నఖాబ్‌ మాటున కళ్లు... ఇది ప్రస్తుత ఆఫ్గన్‌ ముఖ చిత్రం. తినేందుకు తిండి లేదు. చేసేందుకు పనిలేదు. ఎక్కడ చూసినా కరువు. ఆకలి చావులు. మానవతా దృక్పథంతో ప్రపంచం ఆఫ్గనిస్తాన్‌ ను ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది.

కాబూల్‌: ప్రపంచానికి కరోనా ఒక్కటే బాధ. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల చెరలోకి వెళ్లాక... ఆర్థిక సంక్షోభం, కరువు వేధిస్తోంది. అమెరికా తమ ఫెడరల్‌ బ్యాంకు నుంచి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అఫ్గాన్‌ అందాల్సిన నిధులను స్తంభింపజేయడంతో... ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆహార సంక్షోభంతో ఆకలిచావులు పెరిగిపోయాయని.. ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్‌ డేవిడ్‌ బేస్లీ మళ్లీ ఆందోళన వ్యక్తం చేశారు.

తాలిబన్ల వశమవ్వడానికి ముందు కూడా అఫ్తానిస్తాన్‌లో కరువు ఉంది. కానీ... ఆ తరువాత మరింత పెరిగింది. వేలాది మంది ఉపాధ్యాయులు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు.. వారు వీరనే తేడా లేదు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. దేశంలో ప్రధాన ఆధారం వ్యవసాయం. ఈ ఏడు వ్యవసాయమే లేదు.  దీంతో రెండున్నర కోట్లకు కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కూరగాయలు, మాంసం, పాలు ఏవీ లేవు.

ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీల్లో పోషకాహార లోపం పెరిగిపోతోంది.  కుటుంబానికి పిడికెడన్నం పెట్టడం కోసం కడుపున పుట్టిన పిల్లలను, ఇంట్లో ఉన్న వస్తువులను సైతం అమ్ముకుంటున్నారు. పదిలక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు. సగం పైగా జనాభాకు కేవలం నీళ్లు, బ్రెడ్‌ మాత్రమే దొరుకుతోంది. ఒక్కోసారి అది కూడా ఉండటం లేదు. పనిలేదు, ఆదాయం లేదు. ఇంట్లో పిల్లల కడుపునింపే పరిస్థితి లేదు. ఆకలితో అలమటిస్తున్న పిల్లల ముఖాలు చూసే ధైర్యం చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు.  

‘ఆఫ్ఘన్‌ ప్రజలు మనుగడ కోసం తమ పిల్లలను, వారి శరీర భాగాలను విక్రయిస్తున్నారు. దేశంలో సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గానిస్తాన్‌కు సహాయాన్ని వేగవంతం చేయాలి’ అని ఆయన కోరారు. మనవాతా హృదయంతో యావత్‌ ప్రపంచం స్పందించాలని బేస్లీ కోరారు. ఆఫ్గానిస్తాన్‌లో కరువు, మహమ్మారి, ఆర్థిక పతనం, సంవత్సరాల సంఘర్షణ ప్రభావాలతో పోరాడుతోంది.  నాలుగు కోట్ల మందిలో దాదాపు రెండున్నర కోట్ల ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ శీతాకాలంలో సగానికి పైగా జనాభా కరువు బారినపడ్డారు. ఈ సంవత్సరం జనాభాలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని బేస్లీ ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఏడాది ఆగస్టులో అమెరికా, మిత్రదేశాలు దేశం వదిలి వెళ్లినప్పటికీ అనేక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సాయం చేస్తూనే ఉన్నాయి.  కొంత ఆహార సంక్షోభం, మానవతా సంక్షోభాన్ని కొంత తగ్గించగలిగాయి. అయినా పరిస్థితుల్లో రావాల్సినంత మార్పు రాలేదు. అందుకే ప్రస్తుత ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడానికి అఫ్గాన్‌కు సహాయం చేయాలని ప్రపంచంలోని సంపన్నులకు బేస్లీ పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాలు సాయం అందిస్తున్నాయని.. మానవాతా వాదులంతా ఇంకా సాయం చేయాలని బేస్లీ కోరారు.

‘ప్రపంచంలోని బిలియనీర్లు  తరగని ఆస్తులు సంపాదించారు. ఆ సంపద పెరుగుదల నికర విలువ రోజుకు నాలుగువేల కోట్లు. ఇలాంటి స్వల్పకాలిక సంక్షోభాలను పరిష్కరించడానికి మీ ఒకరోజు నికర విలువ పెరుగుదల సరిపోతుంది. కాబట్టి మంచి మనసుతో సహాయం చేయడానికి ముందుకు రండి’ అని బిలియనీర్లకు పిలుపునిచ్చారు. యురోపియన్‌ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నార్వే, యూకే, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు, ప్రత్యేక రాయబారులతో జనవరి 24న ఓస్లోలో సమావేశమై ఆఫ్గన్‌ పరిస్థితులపై చర్చించారు. ఆఫ్గన్ల ఆకలి తీర్చాలంటే ఆహార భద్రతా కార్యక్రమానికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కావాలని తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement