తాలిబన్ల దమనకాండ

7 Afghan civilians killed in a stampede to get into Kabul airport - Sakshi

కాబూల్‌ ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు వేలాది మంది రాక

జనాన్ని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన తాలిబన్లు

తొక్కిసలాటలో నలుగురు మహిళలు సహా ఏడుగురు అఫ్గాన్ల మృతి

కాబూల్‌/బెర్లిన్‌/లండన్‌: పుట్టి పెరిగిన సొంత దేశంలో ఉండలేక, మరో దేశానికి వెళ్లే మార్గంలేక అఫ్గానిస్తాన్‌ ప్రజలు క్షణక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు. పుట్టిన గడ్డపై మమకారం తెంచుకొని, ఎలాగైనా పరాయి దేశాలకు పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని ఆరాట పడితే తాలిబన్‌ రాక్షసులు అడ్డుపడుతున్నారు. ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం లేకుండాపోయింది. అఫ్గాన్‌ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు. దేశ సరిహద్దులను, రహదారులను తాలిబన్లు దిగ్బంధించడంతో వైమానిక మార్గమే దిక్కయ్యింది. దీంతో మరో గత్యంతరం లేక జనం కాబూల్‌ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు.

పాస్‌పోర్ట్, వీసా, టికెట్, చేతిలో డబ్బులు.. ఇవేవీ లేకపోయినా వేలాది మంది అఫ్గాన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు మీద ఆశతో తరలివస్తున్నారు. ఎయిర్‌పోర్టు చుట్టుపక్కలా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన తాలిబన్లు అఫ్గాన్‌ జాతీయులను ముందుకు కదలనివ్వడం లేదు. వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. వినకపోతే చావబాదడానికైనా వెనుకాడడం లేదు. కాబూల్‌ ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేందుకు బయట వేచి చూస్తున్న జనాన్ని చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారని, దీంతో జనం కకావికలమై భారీగా తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనలో నలుగురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు అఫ్గాన్‌ పౌరులు మృతి చెందారని బ్రిటిష్‌ సైన్యం అదివారం ప్రకటించింది. అయితే, వారంతా గాయాల వల్లే మరణించారా? లేక ఊపిరాడక, గుండెపోటుతో మృతి చెందారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.  

అమెరికాయే కారణం: తాలిబన్లు
కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ అమెరికాయే కారణమని తాలిబన్‌ గైడెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ అమీర్‌ఖాన్‌ ఆరోపించారు. అమెరికా నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అఫ్గాన్‌ పౌరులంతా క్షేమంగా ఉన్నారని, అమెరికా సైన్యం నియంత్రణలో ఉన్న కాబూల్‌ ఎయిర్‌పోర్టులోనే హింస జరుగుతోందని అన్నారు. తాలిబన్‌ అధికార ప్రతినిధి నయీం ఇరాన్‌ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ప్రజల మరణాలకు అమెరికాదే బాధ్యతని అన్నారు. అందరినీ తమతోపాటు  తీసుకెళ్తామని అమెరికన్లు ప్రకటించారని, వారి మాటలు నమ్మిన జనం ఎయిర్‌పోర్టుకు పోటెత్తుతున్నారని చెప్పారు.  

కొత్త ప్రభుత్వంపై ప్రకటన ఇప్పుడే కాదు!
కల్లోల అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్‌ అగ్రనేతలు కసరత్తు సాగిస్తున్నారు. కొత్త అధ్యక్షుడిగా తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తాలిబన్లు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. బరాదర్‌ కాందహార్‌ నుంచి రాజధాని కాబూల్‌కు చేరుకున్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్‌ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆగస్టు 31లోగా అఫ్గాన్‌ అమెరికా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కానుంది. కాబట్టి ఆగస్టు 31 దాకా కొత్త ప్రభుత్వంపై ఎలాంటి ప్రకటన చేయొద్దని తాలిబన్లు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

24న జీ–7 భేటీ
అఫ్తానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి జీ–7 దేశాలు మంగళవారం సమావేశమవుతున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదివారం ప్రకటించారు. సురక్షితంగా విదేశీయులను తరలించడం, ఆఫ్గాన్ల భద్రత తదితర అంశాలపై చర్చింనున్నారు. బలమైన గ్రూపు–7 కూటమిలో బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, ఇటలీ సభ్యదేశాలుగా ఉన్నాయి.

అమెరికా విమానంలో అఫ్గాన్‌ మహిళకు ప్రసవం
కాబూల్‌ నుంచి జర్మనీలోని ర్యామ్‌స్టీన్‌ ఎయిర్‌బేస్‌కు వెళ్తున్న అఫ్గానిస్తాన్‌ మహిళ విమానంలోనే ప్రసవించింది. శనివారం యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 విమానంలో పౌరులను ట్రాన్సిట్‌ పోస్టుగా ఉపయోగిస్తున్న ర్యామ్‌స్టీన్‌ ఎయిర్‌బేస్‌కు తీసుకెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. మహిళకు నొప్పులు వస్తున్నట్లు తెలియడంతో విమానాన్ని పైలట్‌ కార్గో ప్రదేశంలో నిలిపేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న అమెరికా వైద్య సిబ్బంది విమానంలోకి చేరుకొని అఫ్గాన్‌ మహిళకు ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సైనికాధిరులు వెల్లడించారు.  

మహిళను ఆస్పత్రికి తరలిస్తున్న ఆర్మీ సిబ్బంది

ఏ దేశం... ఎంతమందిని తరలించిందంటే!

ఐసిస్‌తో ముప్పు
సాఫీగా తరలింపు ప్రక్రియ సాగేందుకు వీలుగా ఆగస్టు 31 దాకా కాబూల్‌ విమానాశ్రయం జోలికి రాకూడదని తాలిబన్లతో అమెరికాకు ఒప్పందం కుదిరింది. దాంతో విమానాశ్రయం నలువైపులా తాలిబన్లు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి... మోహరించి ఉన్నారు. ఎలాగోలా దేశం నుంచి బయటపడాలని ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు పెడుతున్న అఫ్గాన్లను చెల్లాచెదురు చేయడానికి గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు. కొన్నిసార్లు నేరుగా జనసమూహంపైకి తుపాకులు ఎక్కుపెడుతున్నారు. దాంతో తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) తీవ్రవాదుల నుంచి విమానాశ్రయానికి తీవ్ర ముప్పు పొంచివుందని అమెరికా అప్రమత్తం చేసింది. అమెరికన్‌ పౌరులెవరూ తమనుంచి స్పష్టమైన సూచనలు వచ్చేవరకూ కాబూల్‌ విమానాశ్రయానికి రాకూడదని శనివారం హెచ్చరికలు జారీచేసింది. ఐసిస్‌ ఉగ్రవాదులు విమానాలపై క్షిపణులతో దాడి చేయవచ్చని అనుమానిస్తున్నారు. దాంతో అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాలు ఆదివారం విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ సమయంలో యుద్ధతంత్రాలను అవలంభించాయి. అంచెలంచెలుగా ఎత్తును తగ్గించే బదులు... నిప్పులు విరజిమ్ముతూ (శత్రువుల ఉష్ణ అధారిత క్షిపణులను తప్పుదోవ పట్టించడానికి)  ఒక్కసారిగా
నిటారుగా కిందకు దూసుకొచ్చి ల్యాండింగ్‌ చేస్తున్నాయి.

భయపెడుతున్న ‘చెత్త’
 అసంఖ్యాక అఫ్గాన్లు విమానాశ్రయానికి తరలిరావడం... వారు తిని పారేసిన తినుబండారాల తాలూకు ప్యాకింగ్, ఖాళీ వాటర్‌ బా టిళ్లు, కూల్‌ డ్రింక్స్‌ టిన్‌లతో విమానాశ్రయంలో చెత్త కుప్పలు పోగవుతున్నాయి. వీరికి తోడు అమెరికా, నాటో బలగాల వ్యర్థాలు. పారిశుధ్య సిబ్బంది విధులు మానేయడంతో ఎయిర్‌ పోర్టులో తీవ్ర అపరిశుభ్ర వాతావరణం నెల కొందని, పక్షులు, ఇతర జంతువులతో రాకపో కల సమయంలో విమానాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే భయాలు నెలకొన్నాయి.
 

– నేషనల్‌ డెస్క్, సాక్షి.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top