ఖరీదైన మద్యం తాగాలని... | - | Sakshi
Sakshi News home page

పనిచేస్తున్న పబ్‌కే కన్నం వేసిన సెక్యూరిటీ గార్డ్‌

Feb 23 2024 7:40 AM | Updated on Feb 23 2024 9:46 AM

- - Sakshi

బంజారాహిల్స్‌: ఓ పబ్‌ సెక్యూరిటీ గార్డ్‌ విదేశీ లిక్కర్‌ బాటిల్‌ను చోరీ చేసిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని ఆర్‌.యూ పబ్‌లో కొంతకాలంగా వినీత్‌కుమార్‌ అనే యువకుడు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈ పబ్‌కు వచ్చే యువత ఖరీదైన విదేశీ లిక్కర్‌ను సేవిస్తుండటాన్ని గుర్తించిన అతను తాను కూడా స్నేహితులతో కలిసి ఆ లిక్కర్‌ను తాగాలనుకుని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ నెల 16న రాత్రి పబ్‌ మూసివేసిన తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి క్యాష్‌ బాక్స్‌లో ఉన్న రూ.2 లక్షల నగదుతో పాటు ఐదు రాయల్‌ సెల్యూట్‌ లిక్కర్‌ బాటిళ్లు, ఒక చివాస్‌ రీగల్‌, ఒక మొహిట్‌ చాన్‌ దాన్‌ బాటిల్‌ను చోరీ చేసి పబ్‌పై అంతస్తు నుంచి పైపుల ద్వారా కిందకు దిగి పరారయ్యారు. మర్నాడు ఉదయం పబ్‌ మేనేజర్‌ మద్యం బాటిళ్లతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు.

సీసీ ఫుటేజీలు పరిశీలించగా సెక్యూరిటీ గార్డ్‌ వినీత్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు అగంతకులు నగదు, బాటిళ్లతో కిందకు పైపుల ద్వారా కిందకు జారుతున్న దృశ్యాలను గుర్తించారు. ఆ రోజు నుంచి వినీత్‌కుమార్‌ విధులకు హాజరుకావడం లేదని, ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ ఉందని మేనేజర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement