నగరవాసికి 'జపాన్‌' జాబ్‌ కలకలం! బెంగళూరు జపాన్‌ ఎంబసీలో ఆరా తీయగా.. బిగ్‌ షాక్‌! | Sakshi
Sakshi News home page

నగరవాసికి 'జపాన్‌' జాబ్‌ కలకలం! బెంగళూరు జపాన్‌ ఎంబసీలో ఆరా తీయగా.. బిగ్‌ షాక్‌!

Published Fri, Nov 3 2023 4:42 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జపాన్‌లో ఉద్యోగం ఉందంటూ నగరవాసిని నట్టేట ముంచారు సైబర్‌ నేరస్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.29.27 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూసాపేటకు చెందిన యువతి గత జులైలో ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం వెతకగా.. ఓ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఈ–మెయిల్‌ వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్‌ ఉపకరణాల తయారీ సంస్థలో సీనియర్‌ అకౌంట్స్‌ మేనేజర్‌ ఉద్యోగం ఉందని మెయిల్‌ సారాంశం.

ఆగస్టు నెలలో కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న కోజిన్‌ నాకాకిత బాధితురాలిని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేశాడు. ఆ మర్నాడు ఉదయం ఆమె మెయిల్‌కు కంపెనీ నుంచి జాబ్‌కు సెలెక్ట్‌ అయ్యావంటూ జీతభత్యాలు, బెనిఫిట్స్‌తో కూడిన ఆఫర్‌ లెటర్‌ వచ్చింది. అయితే డాక్యుమెంటేషన్‌, జీఎస్‌టీ ఇతరత్రా చార్జీల కోసం రూ.33,780 డిపాజిట్‌ చేయాలని ప్రతినిధులు సూచించడంతో.. నిజమేనని నమ్మిన ఆమె సొమ్మును బదిలీ చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికి పెట్టుబడుల మీద 40 శాతం బోనస్‌తో కలిపి వస్తాయని ఆశ చూపించడంతో రూ.29,27,780 పెట్టుబడులు పెట్టింది.

జీ–20 సదస్సుతో క్యాన్సిల్‌ అంటూ..
ఢిల్లీలో జపాన్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని బాధితురాలిని నమ్మించారు. రోజులు గడుస్తున్నా మీటింగ్‌ ఖరారు కాకపోవడంతో ఆరా తీయగా.. ఢిల్లీలో జీ–20 సమావేశాల నేపథ్యంలో మీటింగ్‌ వాయిదా పడిందని మాయమాటలు చెప్పారు. ఈసారి సమావేశం బెంగళూరులో అక్టోబర్‌ నెలలో ఉంటుందని చెప్పారు. ఈ సమావేశం కూడా జరగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు బెంగళూరులోని జపాన్‌ ఎంబసీలో ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి ఖంగుతింది. అసలు సదరు జపాన్‌ కంపెనీ ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ చేపట్టలేదని తెలిసింది. దీంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది.
ఇవి చదవండి: సినీ నిర్మాత కోసం.. సీసీఎస్‌ వేట! అసలేం జరిగిందంటే?

Advertisement
 
Advertisement