కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి
చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లను వేగవంతం చేసి, వచ్చే మార్చి నాటికి నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని వందశాతం సాధించాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్నతో కలిసి ఉప కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో పన్నుల వసూళ్ల పురోగతిపై సమీక్షించారు. కమిషనర్ టి.వెంకన్న మాట్లాడుతూ పన్నుల వసూళ్ల లక్ష్యాల సాధనకు నిరంతరం పర్యవేక్షణ చేపడతామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కమిషనర్ సమ్మయ్య, ఉప కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఐటీ మేనేజర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: రెండో వేతన సవరణ సంఘం నివేదికను తెప్పించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హనుమకొండ జిల్లా కార్యవర్గం తీర్మానించింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం ఐడీఓసీలోని టీజీఓ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాస్‌కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సమావేశాన్ని ప్రారంభించారు. పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్, కోశాధికారి రాజేశ్‌కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్, రాష్ట్ర కార్యదర్శులు కిరణ్ కుమార్ గౌడ్, కోల్ రాజేశ్, అస్నాల శ్రీనివాస్, అన్వర్ హుస్సేన్, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్‌రావు, తస్లీమా, మాధవరెడ్డి, డాక్టర్ రజినితోపాటు పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
హన్మకొండ: పంచారామాల దర్శనానికి టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పంచారామాలైన అమరావతిలోని అమరేశ్వరాలయం, భీమవరంలోని సోమేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరాలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం, సామర్లకోటలోని కుమార రామ భీమేశ్వరాలయం ట్రిప్ ఉంటుందని ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. చార్జి రూ.2,300గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు హనుమకొండ బస్‌స్టేషన్‌లో ఆన్‌లైన్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించారు. సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 28న సాయంత్రం 7 గంటలకు హనుమకొండ నుంచి బయల్దేరుతుందని పంచరామాల దర్శనానంతరం తిరిగి 30న హనుమకొండకు చేరుకుంటారని పేర్కొన్నారు. అదేవిధంగా.. డిసెంబర్ 5న పంచారామాల దర్శనానికి మరో ప్రత్యేక సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.
హన్మకొండ అర్బన్: రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా.. నిర్వహించిన ఇంటింటి సర్వేను సోమవారం హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. హనుమకొండ బస్టాండ్‌లోని తాత్కాలిక టీకాల కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణారావుతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర పరిశీలకుడు ఫణీందర్ జోషి సమక్షంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని చిన్నారులకు పోలియో చుక్కలు అందాయా లేదా? అని నిర్ధారించుకున్నారు. సోమవారం నిర్వహించిన ఇంటింటి సర్వేలో 1,40,004 ఇళ్లను పరిశీలించగా, 1,016 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.


