హన్మకొండ: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి దమ్ముంటే 24 గంటల్లో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నాయిని రాజీనామా ద్వారా వచ్చే ఎన్నికల్లో నీ స్థాయికి నా స్థాయే ఎక్కువ, నేనే పోటీ చేస్తా. అవసరమైతే బీఆర్‌ఎస్ నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపుతాం’ అని అన్నారు. ఆ ఎన్నికల్లో నాయిని గెలిస్తే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనుంచి తప్పుకుని, ప్రజాజీవితం గడుపుతానన్నారు. ‘కేటీఆర్‌ను విమర్శించే స్థాయి నీది కాదు. ఆయన కాలి గోటికి సరిపోవని’ అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని విమర్శించారు. కాలనీల్లో చిన్నచిన్న పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పెద్దమ్మగడ్డ శ్మశాన వాటిక స్థలం, న్యూశాయంపేట దేవాలయ భూములను కబ్జా చేయాలని చూశావని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించి పూర్తి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు వేసి తన ఘనతగా చెప్పుకుంటోందన్నారు. అభివృద్ధి, రాజకీయ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, అంబేడ్కర్, హనుమకొండ చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్, నాయకులు వాసుదేవరెడ్డి, సుధీర్ కుమార్, లలితాయాదవ్, రజినీకాంత్, రామ్మూర్తి, వెంకన్న, అనిల్ కుమార్, వినీల్ రావు, రాజు యాదవ్, శ్రీధర్, సారిక పాల్గొన్నారు.
కేటీఆర్ ఇక్కడినుంచి పోటీ చేయడం కాదు..
నీ స్థాయికి నా స్థాయి ఎక్కువే
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్


