పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ప్రకటించి అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ప్రకటించి అమలు చేయాలి

Oct 4 2026 11:13 AM | Updated on Oct 4 2026 11:13 AM

టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌

కమలాపూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ రిపోర్టు తెప్పించుకుని ిఫిట్‌మెంట్‌ ప్రకటించి అమలు చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్‌, జిల్లా అధ్యక్షుడు బత్తిని శ్రీరామంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షుడు ఉజ్జేతుల రాజు అధ్యక్షతన మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలనే ప్రభుత్వ ఉత్తర్వు 25ను వెంటనే సవరించి ప్రతీ ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించి, ప్రతి తరగతికి ఒక గదిని నిర్మించి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు పాఠశాల పని వేళల్లో వివిధ రకాల శిక్షణలు, ఆన్‌లైన్‌ యాప్‌ పనులు, బోధనేతర పనులు అప్పగిస్తుండటంతో ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్నారని, దీంతో విద్యార్థుల్లో విద్యా నాణ్యత లోపిస్తోందన్నారు. ఖాళీగా ఉన్న మండల విద్యాధికారులు, జిల్లా ఉప విద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్యాల రఘుపతి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి రమేశ్‌, శ్రీరాములు, మోహన్‌, హరీశ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement