విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో తెలుగు భాషోపాధ్యాయుడు డాక్టర్ వల్సపైడికి తెలంగాణ భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవన్‌లో నిర్వహించిన విద్యాసదస్సులో విద్యాపరిశోధన శిక్షణా సంస్థ డైరెక్టర్ రమేశ్ చేతులమీదుగా ఈపురస్కారాన్ని వల్సపైడి అందుకున్నారు. ఆయనను రాష్ట్ర విద్యా, పరిశోధనా, శిక్షణ సంస్థ డైరెక్టర్ రమేశ్, ఇతర బాధ్యులు సత్కరించి ప్రశంసపత్రం అందించారు.
కాజీపేట: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి ఆటోడ్రైవర్లు, పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ‘అభయ మై టాక్సీ సేఫ్’ యాప్‌ను సీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 12వేల ఆటోలకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ నంబర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామంటూ ఆటోడ్రైవర్లతో సీపీ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీ టి.సత్యనారయణ, సీఐలు వెంకన్న, జక్కుల శ్యాంసుందర్, ఎస్సైలు మంగ, శ్రావణ్ సిబ్బంది పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 7వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్యామల తెలిపారు. హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలోని మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్‌మేళాలో మెడిప్లస్ సంస్థలో వివిధ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. జూనియర్ అసిస్టెంట్ 100, ఫార్మసీ ఎయిడ్ 50, ఫార్మసిస్ట్ 40, సీఎస్‌ఏ 50, ఆడిట్ అసిస్టెంట్ 30 పోస్టులు కలిపి మొత్తం 270 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. నెలకు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. డీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 19–32 ఏళ్ల యువత హాజరుకావొచ్చని సూచించారు. అభ్యర్థులు ఈనెల 7న ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ (బాలుర) ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరుకావాలని, వివరాలకు 78933 94393 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
కాశిబుగ్గ: ‘ఉద్యోగాల పేరుతో దళారుల దందా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి స్పందించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంఽధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఎవరికీ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈనియామకాలు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిఽధిలో ఉంటాయని, ఉద్యోగాల విషయంలో తమ కార్యాలయానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఇలాంటి వారి గురించి తెలిస్తే తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు.
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో మంగళవారం సికింద్రాబాద్ రైల్వే సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టనున్నట్లు సోమవారం స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి సేఫ్టీ రైల్వే అధికారుల బృందం తనిఖీ నిమిత్తం కాజీపేట జంక్షన్‌కు ఉదయం చేరుకుని వివిధ విభాగాలకు వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సేఫ్టీ అధికారుల తనిఖీల సమాచారం తెలియడంతో కాజీపేటలో అన్ని రైల్వే విభాగాలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు.


