హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అనుమానాస్పద ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం కమిటీ సమావేశం నిర్వహించారు. గత మూడు నెలల్లో జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో నిర్వహించిన తనిఖీల వివరాలను డీఎంహెచ్‌ఓ అప్పయ్యను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల నివేదికలను పరిశీలించడంతో పాటు కొత్త అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ సమాచారం అందించిన వారికి రూ.50 వేల పారితోషికం అందిస్తామని తెలిపారు. సమావేశంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మాతా శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఒంటేరు రమేశ్, బన్ను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నీతా, డెమో వి.అశోక్‌రెడ్డి, పద్మజ ఉన్నారు.


