ఉండేదెవరు.. పోయేదెవరు? | - | Sakshi
Sakshi News home page

ఉండేదెవరు.. పోయేదెవరు?

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

ఉండేదెవరు.. పోయేదెవరు?

3.75 లక్షల ఓట్ల తగ్గింపుపై క్షేత్రస్థాయి పరిశీలన

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

టర్ల జాబితాలో ఉండేదెవరు? పోయేదెవరు? అన్నది తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ముసాయిదా జాబితాలో గుర్తించిన వివిధ కేటగిరీల ఓటర్లపై రేపటి (27వ తేదీ) నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే గుర్తించిన అస్పష్ట వివరాలున్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారి నుంచి వివరణ తీసుకుని, అవసరమైన ఆధారాలను పరిశీలించిన అనంతరం తుది ఓటర్ల జాబితాలో ఎవరిని కొనసాగించాలి? ఎవరిని తొలగించాలి? అనేది అధికారులు నిర్ణయించనున్నారు. జూన్‌ 10 నాటికి ఉమ్మడి వరంగల్‌లో 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. ఆగస్టు 17 నాటి ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 26,77,498కు తగ్గింది. అంటే 3,75,740 ఓట్లు.. 12.30 శాతం తగ్గాయి.

నోటీసులు.. విచారణ.. తేలేదెవరు..

ఓటర్లకు నోటీసులు జారీ చేసి.. వారు అదే చిరునామాలో నివసిస్తున్నారా? ఓటరుగా కొనసాగేందుకు అర్హత ఉందా? ఇప్పటికే మరోచోట ఓటరుగా నమోదయ్యారా? అని అధికారులు ఈనెల 27 నుంచి విచారణ చేయనున్నారు. శాశ్వతంగా తరలివెళ్లినట్లు గుర్తించిన వారి విషయంలో చిరునామా, ప్రస్తుత నివాసం తదితర వివరాలను పరిశీలించనున్నారు. చనిపోయినవారి వివరా లను సంబంధిత రికార్డులతో సరిపోల్చనున్నారు. ఆన్‌ ట్రెసబుల్‌/ఆబ్సెంట్‌ కేటగిరీలో ఉన్నవారి విషయంలో క్షేత్రస్థాయి విచారణ కీలకం కానుంది. మరోవైపు జాబితాలో కొనసాగుతున్నప్పటికీ అనామలీస్‌ ఉన్నట్లు గుర్తించిన ఓటర్లపైనా విచారణ జరగనుంది. ఉమ్మడి వరంగల్‌లో ఇలాంటి వారు 4,83,803 మంది ఉన్నారు. అలాగే 1,61,935 మంది ఓటర్లకు నో మ్యాపింగ్‌ ఉన్నట్లు గుర్తించారు. మరోచోట ఇప్పటికే ఓటరుగా నమోదైన 47,177 మంది కూడా కీలక కేటగిరీలో ఉన్నారు. సంబంధిత ఆధారాలు, చిరునామా, ఓటరు వివరాలు పరిశీలించిన తర్వాతే వీరిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అప్పీల్‌కు ప్రత్యేక సెల్‌..

సెప్టెంబర్‌ 20 నాటికి ప్రక్రియ పూర్తి..

తమ పేరు తొలగించే అవకాశం ఉందని భావించే వారు, అధికారుల నిర్ణయంపై అభ్యంతరం ఉన్నవారు అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లు వినియోగించుకోవచ్చు. కాగా, నోటీసులు, విచారణ, అభ్యంతరాలు, అప్పీళ్ల ప్రక్రియను సెప్టెంబర్‌ 20 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అనంతరం తుది జాబితా రూపకల్పన దిశగా ముందుకు వెళ్లనున్నారు.

తుది జాబితాతోనే అసలు లెక్క

ప్రస్తుతం ఉన్నవి ముసాయిదా జాబితా గణాంకాలు మాత్రమే. విచారణలో అర్హత నిర్ధారణ అయితే కొందరు ఓటర్లు తుది జాబితాలో తిరిగి చేరవచ్చు. సరైన ఆధారాలు లేకపోవడం, మర ణం, శాశ్వత వలస, డూప్లికేట్‌ నమోదు తదితరాలు నిర్ధారణ అయితే మరికొందరి పేర్లు తొలగిపోవచ్చు. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న 3.75 లక్షల తగ్గింపు తుది సంఖ్య కాదు. విచారణ, నోటీసులు, క్లెయిమ్‌లు–అభ్యంతరాలు, అప్పీళ్ల తర్వాతే ఉమ్మడి వరంగల్‌లో తుది ఓటర్ల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈనెల 27 నుంచి జరిగే విచారణతో ఈ ప్రశ్నకు సమాధానం మొదలు కానుంది. సెప్టెంబర్‌ 20 నాటికి పూర్తయ్యే ప్రక్రియతో వివిధ కేటగిరీల్లోని ఓటర్లలో ఎవరు జాబితాలో ఉంటారు? ఎవరి పేర్లు తొలగుతాయి? అన్నదానిపై స్పష్టత రానుంది.

చనిపోయింది 79,275

తగ్గిన ఓటర్లు 3,75,740

ఆన్‌ట్రెసబుల్‌ 14,362

వలసవెళ్లింది 2,34,122

ఇతర కేటగిరీ 804

మరోచోట నమోదు 47,177

అనామలీస్‌, డూప్లికేట్‌, వలస ఓటర్లు, ఆన్‌ట్రెసబుల్‌కు నోటీసులు

రేపటి నుంచి అధికారుల విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement