కాశిబుగ్గ: మనిషి మరణించాక నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి కంటి చూపు వస్తుందని ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రవిశేఖర్ అన్నారు. వరంగల్‌లోని కంటి దవాఖానలో మంగళవారం 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి మరణించిన తర్వాత కళ్లను దానం చేస్తే మరో ఇద్దరికి కంటి వెలుగు వస్తుందని తెలిపారు. రెండు వారాల పాటు నేత్రదానంపై అవగాహన కల్పించనున్టన్లు పేర్కొన్నారు. వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలో నేత్రదానం ఆవశ్యకతపై పలు కార్యక్రమాలు చేపడుతామని ఆయన వివరించారు. వైద్యులు హరిదేవ్, చంద్రభాను, అర్చన, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాజీపేట/కాశిబుగ్గ/హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు, అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్లలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాజీపేట, ములుగురోడ్డులోని హనుమకొండ ఐటీఐల ప్రిన్సిపాళ్లు పొన్నాల వేణు, సురేందర్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. విద్యార్థులు iti. telangana.gov.inలో సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు సంబంధిత కళాశాలలకు హాజరై ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపాళ్లు కోరారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీగా బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శాస్త్రిని నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన వై.వెంకయ్య నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శాస్త్రి బయోటెక్నాలజీ విభాగం అధిపతిగా, బీఓఎస్‌గా, ఫారిన్‌రిలేషన్స్ ఆఫీసర్‌గా, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెల్లోగా కొనసాగుతున్నారు. వీసీ ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన ఉత్తర్వుల కాపీ అందుకున్నారు.
హన్మకొండ అర్బన్ : ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హనుమకొండ డీఆర్‌డీఓ రిసోర్స్‌పర్సన్ సంగ సంతోష్‌కు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలశాఖ అవార్డు లభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
శ్రీప్రియకు సేవానంది పురస్కారం
ఖిలా వరంగల్: వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొత్త శ్రీప్రియకు నందిసేవా పురస్కారం లభించింది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ కల్చరల్, యోగా, విద్యా ఫౌండేషన్ బాధ్యులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఆమెకు పురస్కారాన్ని అందజేశారు.
కాళోజీ సెంటర్: తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం (టీబీఎస్‌ఎఫ్) జిల్లా శాఖ రూపొందించిన ఆన్‌లైన్ బ్లాగ్‌ను మంగళవారం డీఈఓ రంగయ్యనాయుడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి పి.సురేష్ బాబు, ఫోరం జిల్లా అధ్యక్షుడు చిప్ప పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి గోనెల రమేశ్, కోశాధికారి గుమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు.


