వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలా గీతాంబ
వరంగల్ లీగల్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ చక్కని అవకాశమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్‌పర్సన్ వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవా సదనం బిల్డింగ్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 12న (శనివారం) జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ న్యాయవాదులతో కలిసి కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి
ఆచార్య గడ్డం వెంకన్న
హన్మకొండ కల్చరల్: జానపద సాహిత్య అధ్యయనానికి ప్రత్యేక గౌరవం లభించిందని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం ఆచార్య గడ్డం వెంకన్న అన్నారు. 2025 సంవత్సరానికి జానపద సాహిత్య పరిషత్ హైదరాబాద్ వారు ప్రదానం చేసే జానపద విజ్ఞాన సాఫల్య పురస్కారానికి జిల్లాలోని తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాసని సురేశ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హంటర్‌రోడ్డులోని విజ్ఞానపీఠంలో జరిగిన కార్యక్రమంలో పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది సురేశ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్‌రెడ్డి, డాక్టర్ గంపా సతీశ్, పరిశోధకుడు సోనబోయిన సతీశ్, విద్యార్థులు పాల్గొన్నారు.


