కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో ఎక్స్‌రే టెక్నీషియన్లు, సీటీ టెక్నీషియన్లు సరిగా విధులు నిర్వర్తించకుండా ట్రైనీ విద్యార్థులకు పనులు అప్పజెప్పుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఓపీతోపాటు క్యాజువాలిటీలో అత్యవసర సేవల కోసం వచ్చే పేషంట్లకు అగచాట్లు తప్పడం లేదు. మంగళవారం ఉదయం రేడియాలజీ విభాగంలో అసలైన ఎక్స్‌రే టెక్నీషియన్లకు బదులు విద్యార్థులు పనులు చేయడంతో గందరగోళం నెలకొంది. క్యాజువాలిటీ 7వ నంబర్, ఎక్స్‌రేల కోసం 92 నంబర్‌కు వస్తే పరిిస్థితి మరింత దారుణంగా ఉందని వాపోతున్నారు. మినీ డీఆర్ కూడా పనిచేయకపోవడంతో మ్యానువల్‌గా విద్యార్థులే ఎక్స్‌రేలు తీయడం వల్ల మరింత జాప్యం అవుతోందని చెబుతున్నారు. ఎక్స్‌రేలు ఆలస్యం కావడంతో రోగులు, సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చివరకు సెక్యూరిటీ జోక్యం చేసుకుని సర్దిచెప్పినట్లు సమాచారం. విద్యార్థులకు మిషన్లపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం.. ఎక్స్‌రేలు ఎక్కువగా తీయడం వల్ల మిషన్లు రిపేర్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. ‘పనిచేయని ఎక్స్‌రే మిషన్లు’ శీర్షికన 15 రోజుల క్రితం సాక్షిలో కథనం ప్రచురితం కాగా.. అధికారులు స్పందించి బాగు చేయించారు. మళ్లీ రిపేర్‌కు రావడం అధికారులకు తలనొప్పిగా మారింది. రేడియాలజీ విభాగంలో సంబంధిత అధికారుల నియంత్రణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.


