రైతు పోరాట యోధుడు ‘సారంపల్లి’ | - | Sakshi
Sakshi News home page

రైతు పోరాట యోధుడు ‘సారంపల్లి’

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

20 రోజుల వ్యవధిలో

ఇద్దరు కమ్యూనిస్టు దిగ్గజాలు మృతి

తిమ్మంపేటలో నివాళి..

మల్లారెడ్డి మృతికి సంతాపం..

దుగ్గొండి: రైతాంగ పోరాట యోధుడు, సీపీఎం సీనియర్‌ నాయకుడు, అఖిలభారత కిసాన్‌సభ (ఏఐకేఎంఎస్‌) ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి (87) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో సోమవారం కన్నుమూశారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన సారంపల్లి కృష్ణారెడ్డి, రాధమ్మ దంపతులకు ఆరుగురు సంతానం కాగా మల్లారెడ్డి మూడో సంతానం. 1939 ఆగస్టు 25న జన్మించిన మల్లారెడ్డి హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకుని గ్రామంలో పోలీస్‌ పటేల్‌గా 1964 నుంచి 1971 వరకు పనిచేశారు. ఇదే సమయంలో గ్రామంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ మధ్య నిత్యం గొడవలు జరిగేవి. కమ్యూనిస్టులకు పరోక్షంగా సహకరిస్తున్నాడనే నెపంతో పోలీసులు మల్లారెడ్డిపై అనుమానం వ్యక్తం చేయడంతో 1971లో రాజీనామా చేశారు. తన తమ్ముడు సారంపల్లి రాజిరెడ్డి ద్వారా దివంగత మాజీ ఎమ్మెల్యే ఓంకార్‌కు పరిచయమై పూర్తికాల కార్యకర్తగా సీపీఎం పార్టీలో పనిచేయడం ప్రారంభించారు. తాలుకా కమిటీ సభ్యుడిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా రైతు సంఘం డివిజన్‌, మండల, జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా చాలా కాలం పనిచేసి అఖిలభారత కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసి రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చదివింది హెచ్‌ఎస్‌సీ. అయినా అనేక యునివర్సిటీల్లో రైతాంగం సమస్యలపై ఆంగ్లంతో అనర్గళంగా ప్రసంగించారు. మల్లారెడ్డికి భార్య భాగ్యలక్ష్మి, కుమారులు వాసుదేవరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కుమార్తెలు అనిత, అజిత ఉన్నారు.

ప్రజాప్రతినిధిగా సేవలు..

సారంపల్లి మల్లారెడ్డి మొదటిసారి 1981 నుంచి 87 వరకు సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 1987లో సింగిల్‌ విండో చైర్మన్‌గా గెలిచి జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశాడు.

నిరంతర అధ్యయన శీలి..

మాల్లారెడ్డి నిరంతర అధ్యయనశీలి. ప్రతీ అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి రైతాంగం, ప్రజల బాధను గణాంకాలతో సహా వివరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. శ్రీరాంసాగర్‌ వరద కాల్వ నిర్మాణ పనులు పూర్తికావడానికి 200 గ్రామాల ప్రజలను కూడగట్టి ఉద్యమాలు చేశారు. నల్లబెల్లి మండలంలో ఫారెస్టు భూమిని పేదలకు పంచి ఇళ్లు నిర్మింపజేశారు. రైతులు, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధులు–నిధులు, తదితర సమస్యలపై 2008 నుంచి 2026 వరకు 20 పుస్తకాలు రచించారు.

గాంధీ మెడికల్‌ కళాశాలకు పార్థివదేహం అందజేత..

మల్లారెడ్డి పార్థివదేహాన్ని సోమవారం ఉదయం నుంచి ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఉంచారు. మంగళవారం పార్థివదేహాన్ని గాంధీ మెడికల్‌ కళాశాలకు వైద్య పరిశోధన నిమిత్తం అప్పగించనున్నట్లు ఆయన కుమారులు వాసుదేవరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

20 రోజుల వ్యవధిలో దుగ్గొండి మండలానికి చెందిన ఇద్దరు కమ్యూనిస్టు దిగ్గజాలు అనారోగ్యంతో మృతి చెందారు. నాచినపల్లికి చెందిన పుచ్చకాయల చంద్రారెడ్డి(90) ఆగస్టు 3న మృతి చెందాడు. ఆయన మృతి చెందిన రోజున సారంపల్లి మల్లారెడ్డి నాచినపల్లికి వచ్చి చంద్రారెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రారెడ్డి భార్య మల్లక్కను ఓదార్చారు. సరిగ్గా 20 రోజులకు సోమవారం సారంపల్లి మల్లారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు.

జనగామ : కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడు, అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి కమ్యూనిస్టు, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని జనగామ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హన్మకొండ: రైతాంగ సమస్యలపై, వ్యవసాయ రంగం అభివృద్ధికి తన జీవితకాలం పోరాటం చేసిన రైతు ఉద్యమ నాయకుడు మల్లారెడ్డి అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ తెలిపారు.

పాలకుర్తి టౌన్‌: వామపక్ష , శ్రామిక,రైతు ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మల్లారెడ్డి అని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ పేర్కొన్నారు.

ఖిలా వరంగల్‌ : మల్లారెడ్డి మృతి రైతాంగానికి తీరని లోటని వరంగల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రధాన కార్యాలయంలో సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పోలీస్‌ పటేల్‌ నుంచి అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షుడి వరకు పలు పదవులు..

అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత

విషాదంలో కమ్యూనిస్టు నాయకులు, శ్రేణులు

సారంపల్లి మల్లారెడ్డి స్వ గ్రామం తిమ్మంపేటలో సోమవారం ఆయనకు సర్పంచ్‌ మోడెం శ్రీలత– మల్లేశం, సీపీఎం నాయకులు అక్కపెల్లి సుధాకర్‌, నల్లగొండ మొగిలి, సంజీవరెడ్డి, ఎంసీపీఐ నాయకులు నాగెల్లి కొంరయ్య, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నివాళులర్పించారు. అలాగే, నర్సంపేటలోని అమరవీరుల స్తూపం ప్రాంగణంలో మల్లారెడ్డి చిత్రపటం వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపల్లి బాబు, కోరబోయిన కుమారస్వామి, కౌన్సిలర్‌ హన్మకొండ శ్రీధర్‌ నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement