8 సంవత్సరాలు నిర్వహణ బాధ్యత ఏజెన్సీదే..
రూ.6 కోట్లతో పునరుద్ధరణ పనులు
వరంగల్ అర్బన్: ఉత్తర తెలంగాణలోని ఏకై క నక్షత్రశాల అయిన హిందూజ ప్రతాపరుద్ర ప్లానిటోరియం 15 ఏళ్లుగా ప్రదర్శనలు లేక మూలనపడింది. కాలం చెల్లిన ప్రొజెక్టర్ మరమ్మతులకు రావడంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేతులెత్తేశారు. చాలామంది మేధావులు.. కలెక్టర్లకు, రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు నక్షత్రశాలను తిరిగి ప్రారంభించాలని వినతిపత్రాలిచ్చారు. ఎట్టకేలకు ప్లానిటోరియం పునఃప్రారంభోత్సవానికి సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి ప్రదర్శనల ద్వారా అంతరిక్ష విజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
పీవీ చొరవతో ప్లానిటోరియం
మాజీ దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్లానిటోరియం ఏర్పాటైంది. 1982లో నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నక్షత్రశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హిందూజ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో జర్మనీ దేశం నుంచి ప్రొజెక్టర్ తెప్పించారు. భవన నిర్మాణం మాత్రమే కార్పొరేషన్ చేపట్టింది. 1984లో పీవీ నర్సింహారావు ప్రతాపరుద్ర హిందూజ ప్లానిటోరియాన్ని ప్రారంభించారు. దీని పర్యవేక్షణ బాధ్యత మున్సిపాలిటీకి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన భరత్‌కుమార్‌రెడ్డిని ప్లానిటోరియం డైరెక్టర్‌గా నియమించారు. 1994 నుంచి 2004లోనే నక్షత్రశాలలో అంతరిక్ష ప్రదర్శనలు నడిచాయి. భారీ టెలిస్కోప్ సహాయంతో అంతరిక్ష ప్రదర్శనలు కొనసాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు ప్లానిటోరియాన్ని సందర్శించారు. 2004లో ప్రొజెక్టర్ పాడైంది. కొన్నాళ్లు మరమ్మతులు చేసి అడపాదడపా షోలు ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రొజెక్టర్ మొరాయించడంతో పూర్తిగా షోలను నిలిపేశారు.
గ్రేటర్ వరంగల్ పర్యవేక్షణలో ఉన్న ప్లానిటోరియాన్ని తిరిగి ప్రారంభించేందుకు గడువు ఖరారైంది. భవనానికి సివిల్ పనులు పూర్తయ్యాయి. త్వరలో అధునాతన యంత్రాలు విదేశాల నుంచి దిగుమతి కానున్నాయి. కమిషనర్ ఆదేశాలతో అక్టోబర్ 2 నుంచి సిద్ధం చేసేందుకు సదరు ఏజెన్సీ నిర్వాహకులు అంగీకరించారు. గడువులోగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటాం.
– రాజ్‌కుమార్, బల్దియా ఎస్‌ఈ
అక్టోబర్ 2 నుంచి ప్లానిటోరియంలో షోలు
విదేశాల నుంచి అధునాతన యంత్రాల దిగుమతి
ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులతో గ్రేటర్ కమిషనర్ వెంకన్న సమావేశం
స్మార్ట్‌సిటీకి చెందిన రూ.2కోట్ల నిధులతో ప్లానిటోరియం భవనానికి పనరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. రూ.4 కోట్లతో డోమో, ప్రొజెక్టర్లు, ఆడియో సిస్టమ్ తదితర ఆధునిక పరికరాలు, ఫర్నిచర్, సైన్స్ బొమ్మల ఏర్పాట్లకు టెండర్లు ఖరారయ్యాయి. సదరు ఏజెన్సీ సంస్థ తైవాన్, ఇజ్రాయిల్ నుంచి అధునాత పరికరాలు దిగుమతి చేసుకునేలా కసరత్తు పూర్తయినట్లు బల్దియా ఇంజనీర్లు వెల్లడించారు. 8 ఏళ్ల పాటు సదరు ఏజెన్సీ నిర్వాహకులదే ప్రదర్శనల నిర్వహణ బాధ్యత. అక్టోబర్ 2 నుంచి తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఇంజనీర్లు, సదరు ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై గడువులోగా షోలు నడిపించాలని సీరియస్‌గా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు, విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానాన్ని కళ్లకుకట్టినట్లుగా వీక్షించనున్నారు.


