కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ఐడీ వార్డు నిర్వహణపై డీఎంఈ డాక్టర్ వాణి ఆరా తీసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా వివరణ కోరినట్లు సమాచారం. ‘ఐడీ వార్డు.. ఆగమాగం’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలని సంబంధిత శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఈసందర్భంగా పొద్దున్నే నలుగురు సానిటేషన్ సిబ్బంది ఐడీ వార్డుకు వెళ్లి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా నివారణ చర్యలు తీసుకున్నారు. ఐడీ వార్డు ఎదుట అడ్డదిడ్డంగా ఉన్న రాళ్లను సరిచేసి, సిమెంట్, కంకరతో సరి చేయించారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సిబ్బంది నీటి సదుపాయం కోసం ఒక నల్లాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ అశ్విని మాట్లాడుతూ.. ఐడీ వార్డులో ఉన్న పేషెంట్లను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రావడం లేదని, వారిని ఎక్కడికి పంపించలేక వార్డులోనే ఉంచాల్సి వస్తోందన్నారు. వీరిలో కేవలం ముగ్గురు పేషెంట్ల కోసం అవసరాన్ని బట్టి వైద్యులు వార్డుకు వచ్చి వెళ్తుంటారని తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఓ మహిళకు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరు చెప్పినా వినకుండా క్లీన్ చేయడం, పక్క పేషెంట్లను ఇబ్బందులు పెట్టడం చేస్తోందని వివరించారు. ఆమెను అనాథాశ్రమానికి పంపాలనుకున్నా అక్కడ కూడా తోటి వారిని ఇబ్బందులు పెడుతుందన్న ఉద్దేశంతో ఐడీ వార్డులోనే ఉంచాల్సి వస్తోందని పేర్కొన్నారు.
నివేదిక తెప్పించుకున్న
వరంగల్ కలెక్టర్ సత్యశారద


