హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్రేశ్వరస్వామిని మధుర మీనాక్షి అమ్మవారిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠ అవధాని, అర్చకుడు ప్రణవ్ ఉదయం నుంచి సుప్రభాత సేవ, గణపతిపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు.
వరంగల్ స్పోర్ట్స్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ 2026–27 కోసం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ శుక్రవారం తెలిపారు. హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పాల్గొనాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 3న జేఎన్‌ఎస్‌లో ఉదయం 8 గంటలకు ఐడీ కార్డు, ప్రస్తుత సర్వీస్ సర్టిఫికెట్‌తో హాజరుకావాని సూచించారు. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, షటిల్ బాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో–ఖో మొదలైన క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు శ్రీమన్నారాయణ అథ్లెటిక్స్ కోచ్ 94410 86556ను సంప్రదించవచ్చని సూచించారు.
కాజీపేట అర్బన్: బీసీ కులాలకు చెందిన నిరుద్యోగ బీసీ మహిళలకు వందశాతం సబ్సిడీతో ఆటోమెటిక్ కుట్టు మిషన్లను పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకంలో లబ్ధిపొందేందుకు ఆన్‌లైన్‌లో tgobmms. cgg. gov. in వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను శుక్రవారం సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ సెక్రటరీ నవీన్‌కుమార్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన శిల్ప కళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఆతర్వాత ఖుష్‌మాహల్, రాతి, మట్టికోట, ఏకశిలగుట్ట అందాలు వీక్షించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను గైడ్ రవియాదవ్, సెంట్రల్ ఎలక్షన్ సెక్రటరీ నవీన్‌కుమార్‌కు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ ఉదిత్‌కుమార్, తహసీల్దార్ ఇక్బాల్, ఆర్‌ఐ వరుణ్, రెవెన్యూ సిబ్బంది, కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్‌చార్జ్ అజయ్ పాల్గొన్నారు.


