సమీక్షలో కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: నగరంలో వివిధ పండుగలను ప్రశాంత వాతావరణంలో, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, హార్టికల్చర్ తదితర విభాగాల అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈనెల 26న మిలాద్ నబీ, వచ్చే నెల 14నగణేశ్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనాల సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా నగరంలోని పలు డివిజన్లలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కొబ్బరి వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను పరిశీలించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు.
వాకీటాకీల అందజేత..
బల్దియా కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులకు కమిషనర్ వెంకన్న శుక్రవారం వాకీటాకీలు అందించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలు, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల మధ్య వేగవంతమైన సమాచార మార్పిడి, సమన్వయానికి వాకీటాకీలు ఎంతో ఉపయోగకరం అన్నారు.


