నేటినుంచి దక్షిణ భారత స్థాయి
హన్మకొండ: వరంగల్ వేదికగా ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు దక్షిణ భారతదేశ స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ల సదస్సు జరగనుందని ఆ సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం హనుమకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర రాజధానుల్లో జరిగే ఈ సదస్సును తొలిసారిగా వరంగల్‌కు తీసుకొచ్చామన్నారు. వరంగల్ ర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆర్థోపెడిక్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో మూడు రోజు పాటు ఈ సదస్సు కొనసాగుతుందన్నారు. ఇందులో వర్క్‌షాప్, సెమినార్లు, శిక్షణ నిర్వహించనున్నట్లు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి 1,000 మంది ఆర్థోపెడిక్ సర్జన్లు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అధ్యక్షుడు కృష్ణ గోపాల్ రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి రోషన్, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జగన్ మోహన్, కెఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని వివరించారు. విదేశాల్లో ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగంలో శిక్షణ పొందిన నిపుణులు ఈ సదస్సులో ప్రసంగిస్తారన్నారు. తద్వారా యువ సర్జన్లు, పీజీ విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ బాధ్యులు రాకేశ్, శ్రీనివాస్ రెడ్డి, శిరీశ్, ఉత్తం వైద్య పాల్గొన్నారు.
ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు
పెసరు విజయ్ చందర్ రెడ్డి


