హన్మకొండ చౌరస్తా: పదవుల కోసం పార్టీలు మారే సంస్కృతి మీది అంటూ కొండా సురేఖ కూతురు సుస్మితపై కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి గురువారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాల్లో మొదట టీడీపీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీఆర్‌ఎస్ ఇలా అన్ని పార్టీల్లో తిరిగి చివరికి కాంగ్రెస్‌లో చేరిన సంస్కృతి కొండా సురేఖది అన్నారు. పదవులు అనుభవిస్తూనే నాయకులను విమర్శిస్తూ పార్టీని నిర్వీర్యం చేసే అలవాటు మీదేనంటూ మండిపడ్డారు. అనేక పార్టీలు మారి కాంగ్రెస్‌లో చేరితే కార్యకర్తలు అక్కున చేర్చుకుని గెలిపించుకుంటే, ఇప్పుడు గెలిపించిన ప్రజలనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికి రెండు సార్లు పొరపాటు చేశారని, ఇక మీదట వీరిని క్షమించకుండా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ, సీఎంను కోరారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ వరంగల్‌లో ఉన్న కొండా వర్గం కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సుస్మిత వ్యాఖ్యల ను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని, ఈ విషయంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధిష్టానానికి పంపించాలని డీసీసీని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ గతంలో వేం నరేందర్‌రెడ్డి కాళ్లు పట్టుకున్నది మరిచిపోయారా అంటూ కొండా దంపతులను ఉద్దేశించి అన్నారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ పార్టీలో నెలకొన్న సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా రాజకీయ క్రమశిక్షణ కమిటీ ఉందని, ఏదైనా ఇక్కడే చర్చించాలన్నారు. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మాట్లాడుతూ బీసీ జపం చేస్తూ బీసీలపైనే కేసులు పెట్టించిన చరిత్ర కొండా దంపతులదన్నారు. మాజీ మేయర్ గుండు సుధారాణి, నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, మార్క విజయ్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, కూచన రవళి, వెంకట్రాజం తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
కొండా సుస్మితపై ఘాటు వ్యాఖ్యలు


