నయీంనగర్: ఇన్నర్ వీల్ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక పాఠశాల స్థాయి బాలల నాటక పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు అధ్యక్షుడు సుమతినాయుడు తెలిపారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకత, నటన కళను వెలికితీసి ప్రోత్సహించడంతో పాటు వారిని బాధ్యతాయుతమైన సమాజహితులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పాఠశాలల విద్యార్థులు, నాటిక వ్యవధి 30–45 నిమిషాల మధ్య ఉండి నాటకలో పాల్గొనేవారు ఒకే పాఠశాల విద్యార్థులై ఉండాలని తెలిపారు. నాటిక ఇతివృత్తాలు సమాజంలో చైతన్యం రగిలించేవి, కుల వివక్ష నిర్మూలన, మూఢనమ్మకాలు, నరబలుల వ్యతిరేక ప్రచారం, ఈవ్ టీజింగ్, కలుషిత ఆహారం – ఆరోగ్య భద్రత, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఎంట్రీలు ఈనెల 30లోపు పంపాలని కోరారు. నాటకల ప్రాథమిక పరిశీలన అక్టోబర్ 15 నుంచి 30వ తేదీ వరకు, నాటక పోటీలు, బహుమతుల ప్రదానం నవంబర్ 12, 13, 14వ తేదీల్లో ఉంటుందని వివరించారు. ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి 8 వేలు, ప్రతీ నాటిక ప్రదర్శన పారితోషికం రూ.5 వేలు రివార్డు ఉంటుందని తెలిపారు. ఎంట్రీలను 88975 52958 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. సమావేశంలో శోభావతి, ఎం.రేణుక, శ్యాంసుందర్, లలిత, నాగేశ్వర్ రావు, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


