కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో డాక్టర్ కోసం రోగులు పడిగాపులు పడాల్సి వచ్చింది. బుధవారం సదరు డాక్టర్ ఉదయం 9 గంటలకు రావాల్సి ఉంది. చాలామంది ఓపీ తీసుకుని డాక్టర్ కోసం గంటన్నరకు పైగా నిరీక్షించారు. అయితే డాక్టర్ 10.30 గంటల తర్వాత వచ్చి రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. కాగా, సమాచారం తెలుసుకున్న ఆయుష్ ఆర్డీడీ డాక్టర్ బి.ప్రమీలాదేవి ఉదయం 11 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ ఆలస్యంగా రావడం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రైలు ఆలస్యం కావడంతో ఆలస్యంగా వచ్చానని డాక్టర్ చెప్పారని ఆర్డీడీ తెలిపారు. ఇకనుంచి అలా జరగకుండా చూసుకుంటానని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, గత బోనాల పండుగ రోజు పనిదినమైనా వైద్య సిబ్బంది రాలేదనే సమాచారం రావడంతో వారికి మెమోలు జారీ చేసినట్లు ఆమె వివరించారు.


