చిత్తడి నేలలను గుర్తించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపునకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన వెట్ ల్యాండ్ (చిత్తడి నేలలు) గుర్తింపు పరిరక్షణకు జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వ సూచన మేరకు చిత్తడి నేలల గుర్తింపు, ప్రాముఖ్యత గురించి వివరించారు. క్షేత్రస్థాయి పర్యటన చేసి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ చిత్తడి భూముల జియో ట్యాగింగ్ చేస్తున్నామని, ఆయా భూముల్లో నిర్మాణాలకు అనుమతి ఉండదన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నేలల స్వభావాన్ని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


