ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. ఈ మేరకు మంగళవారం శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రాష్ట్రస్థా యి పోటీ పరీక్షలతోపాటు ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి పోటీ పరీక్షలకు హనుమకొండలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఐదు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న అభ్యర్థులు ఈనెల 30 వరకు htttp://tsstudyircle.co.inలో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 8న హనుమకొండలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల డిప్యూటీ డైరెక్టర్ బి.నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.జగన్‌మోహన్, హైమావతి, కవిత, మమత పాల్గొన్నారు.
పండుగ శుభాకాంక్షలు..
భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవానం ఒక ప్రకటన లో కోరారు. పండుగతో ప్రజల జీవితాల్లో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


