స్పాంజ్‌.. చేంజ్‌..! | - | Sakshi
Sakshi News home page

స్పాంజ్‌.. చేంజ్‌..!

Jul 30 2025 6:36 AM | Updated on Jul 30 2025 6:36 AM

స్పాంజ్‌.. చేంజ్‌..!

స్పాంజ్‌.. చేంజ్‌..!

సాక్షి, వరంగల్‌:

రంగల్‌ మహానగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు ప్రధాన నాలాల విస్తరణ, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు చేపట్టిన గ్రేటర్‌ వరంగల్‌ నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ‘స్పాంజ్‌’ పార్కుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. వరదను నియంత్రించడంతోపాటు భూగర్భ నీటిమట్టం పెంచే దిశగా ఆలోచన చేస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చైన్నెలో విజయవంతమైన ఈ పార్కు థీమ్‌ను ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు వర్షాకాలంలో వచ్చే వరద నీటిని పీల్చేసి భూమి లోపలికి పంపించే స్పాంజ్‌ పార్కుల నిర్మాణం చేయనుంది. మున్సిపల్‌ కమిషనర్లతో సీడీఎంఏ డాక్టర్‌ టీకే శ్రీదేవి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ‘స్పాంజ్‌ పార్కు’ల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఈ ప్రతిపాదనలను రూపొందించి పంపిస్తామని చెప్పారు. దీనిపై ఇంజనీరింగ్‌, హార్టికల్చర్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా 135 లోతట్టు ప్రాంతాలు ఉండగా.. ఎక్కడెక్కడ సాధ్యమవుతాయో, ఎన్ని పార్కుల నిర్మాణానికి అవకాశం ఉందనే వివరాలను క్షేత్రస్థాయిలో కలియతిరుగుతూ పరిశీలిస్తున్నారు. తొలుత శివనగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, బీఆర్‌నగర్‌, సమ్మయ్యనగర్‌, గోపాలపూర్‌, ములుగురోడ్డు, సాయిగణేశ్‌ కాలనీ, వివేకానంద కాలనీ, ఎస్‌ఆర్‌నగర్‌లో ఈ పార్కుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు ఏర్పాటుచేశాక ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. త్వరలోనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ స్పాంజ్‌ పార్కుల ఏర్పాటు ఆవశ్యకతపై హైదరాబాద్‌లో బుధవారం జరిగే సమావేశానికి బల్దియా నుంచి ముఖ్య అధికారులు హాజరుకానున్నారు.

అక్కడి మాదిరిగానే..

2015లో చైన్నెలో భారీ వరదలు రావడంతో వందలాది మంది చనిపోయారు. అందుకోసమే నగరంలో రూ.7.67 కోట్లతో 57 స్పాంజ్‌ పార్కులు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. వీటిలో నిర్మించే కుంటలు ఒక్కొక్కటి 340 చదరపు మీటర్ల నుంచి 7 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఉండేలా ప్రణాళికలు చేశారు. ముందుకు వరదలు వస్తే తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రాంతాలు, భూమిలో నీరింకే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వరద ఎక్కువైతే ఆ నీటిని పార్కులకు చేరేలా పైపులు అమర్చుతూ పార్కు సామర్థ్యానికి అనుగుణంగా కుంటలు తవ్వుతున్నారు. మధ్యలో ఎక్కువ లోతు ఉంచి చుట్టూ వాలుగా నిర్మిస్తున్నారు. మోస్తరు, భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ నీరు కూడా ఇందులోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 10 పార్కులు మాత్రమే నిర్మించారు. అలాగే, వీటిలో స్థానికులకు ఆహ్లాదం కల్పించేందుకు మొక్కలు పెంచుతున్నారు. క్రీడా స్థలాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అపరిశుభ్రత, దోమల ఉధృతి పెరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానాన్నే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అమలు చేయడం ద్వారా వరద ఉధృతిని తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు.

గ్రేటర్‌లో నీరు పీల్చుకునే పార్కుల ఏర్పాటుకు అడుగులు

లోతట్టు ప్రాంతాల్లో

నిర్మాణానికి అధికారుల ప్రణాళిక

పార్కు సామర్థ్యానికి అనుగుణంగా వరద వెళ్లేందుకు కుంటల తవ్వకం

ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో

జీడబ్ల్యూఎంసీ యంత్రాంగం

ఇప్పటికే చైన్నెలో

విజయవంతమవుతున్న థీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement