
సాంకేతిక పురోభివృద్ధి..
టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న టీజీ ఎన్పీడీసీఎల్
హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి (టీజీఎన్పీడీసీఎల్) సాంకేతిక పురోభివృద్ధిలో దూసుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా దిశగా పరుగులు పెడుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్నాటి వరుణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రధానంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వరుణ్ రెడ్డి టెక్నాలజీలో తన అనుభవాన్ని జోడిస్తూ ఆన్‌లైన్ సేవలను వినయోగదారుల ముందుకు తీసుకొచ్చారు. ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా కంపెనీలో టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. 17 జిల్లాల పరిధి కలిగి ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ 72.35 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్‌లో ప్రవేశపెట్టిన టెక్నాలజీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సైది.. సైఫీ..
సిస్టమ్ ఆవరేజ్ ఇంటరప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైది) అనగా వినియోగదారులకు ఎదురయ్యే సగటు అంతరాయ వ్యవధిని, సిస్టమ్ ఆవరేజ్ ఇంటరప్షన్ ఫ్రిక్వెన్షీ ఇండెక్స్ (సైఫీ) అనగా సగటు అంతరాయాల సంఖ్యని విద్యుత్ అంతరాయాలకు కొలమానంగా తీర్చిద్దిదడం. సగటున వినియోగదారుడికి ఎన్ని సార్లు జరిగిన అంతరాయంపై రియల్ టైం డేటాను క్రోడీకరించి వాస్తవ గణాంకాల ఆధారంగా విశదీకరించి అంతరాయాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకుని అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకొచ్చారు. సైది, సైఫీ ద్వారా తరచూ విద్యుత్ అంతరాయాలు జరిగే ఫీడర్లపై దృష్టి సారించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
హైపర్..
ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించిన సమయంలో అతి తక్కువ సమయంలో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టడానికి ‘హైపర్’ అనే కార్యాచరణను రూపొందించారు. ఉద్యోగులు పని చేసే చోట నివాసముండి, సిబ్బంది, సామగ్రిని సమీకరించుకోవడం, సమాచార సేకరణ చేరవేయడం, పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించడం హైపర్ ఉద్దేశం.
ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల ఏర్పాటు
వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణం చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటెనెన్స్, ఇతరత్రా ఏదేని కారణాలతో ఒక లైన్‌లో సమస్య ఉత్పన్నమైతే మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ లైన్లు వేశారు. ప్రధానంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల మధ్య ఈ ఇంటర్ లింక్ లైన్లు వేశారు. ఫలితంగా ఒక సబ్ స్టేషన్‌లో సమస్య ఉంటే మరో సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది.
రియల్‌టైం మానిటరింగ్ సిస్టమ్..
వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ఎంతో దోహదపడుతుంది. ఇందులో రియల్ టైంలో కచ్చితమైన సమాచారం పొందడం ద్వారా వేగంగా చర్యలు చేపట్టొచ్చు. ఫీడర్ల పర్యవేక్షణ, త్వరితగతిన ప్రతిస్పందించడం ద్వారా అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి. రియల్ టైంలో విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి అందించి అతి తక్కువ సమయంలో సరఫరాను పునరుద్ధరించడం దీని ద్వారా సాధ్యం.
ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు..
విద్యుత్ సరఫరా వ్యవస్థలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో తలెత్తే సాంకేతిక లోపాలు వెంటనే తెలుసుకునేందుకు పొడవాటి విద్యుత్ లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్‌లో లోపం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం వెళ్తుంది. లోపం ఏ ప్రాంతంలో తలెత్తిందో స్పష్టంగా తెలియడం ద్వారా వేగంగా ఆ లోపాన్ని సరిచేసి తక్కువ సమయంలో విద్యుత్‌ను పునరుద్ధరిస్తారు. దీని ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చు.
ఇ–స్టోర్..
పేపర్ విధానంలో మెటీరియల్ విడుదలకు ఆలస్యమవుతుండడంతో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఇ–స్టోర్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో సంబంధిత సెక్షన్ ఏఈ పనికి కావాల్సిన మెటీరియల్ స్టాక్ ఉందో సాఫ్ట్‌వేర్‌లో పరిశీలిస్తారు. అవసరమైన స్టాక్‌ను రిజర్వ్ చేసుకుంటాడు. రిజర్వ్ చేసుకున్న మెటీరియల్ తాలూకు సమాచారం సంబంధిత ఏడీఈకి, తర్వాత స్టోర్స్‌కు ఆన్‌లైన్ ద్వారా వెళ్తుంది. మెటీరియల్ స్వీకరించే అధికారికి ఏ రోజు మెటీరియల్ విడుదల చేస్తారో ఆ తేదీని, సమయాన్ని ఎస్‌ఎంఎస్, సాప్ మెయిల్ రూపంలో సమాచారం చేరవేస్తారు. దీంతో నిర్ణీత సమయానికి స్టోర్స్‌కు చేరుకుని మెటీరియల్ తీసుకుంటారు. తద్వారా అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరముండదు. సమయం ఆదా అవుతుంది. వ్యయప్రయాసలు తగ్గుతాయి.
వినియోగదారులకు మెరుగైన
సేవలందించడమే లక్ష్యంగా ముందుకు
అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా దిశగా పరుగులు..
వాట్సాప్ చాట్‌బాట్
విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు అధికారులకు తెలియజేసేందుకు యాజమాన్యం వాట్సాప్ చాట్ బాట్‌ను తీసుకొచ్చింది. ఇందులో ముందు వినియోగదారులు తమ మొబైల్ నుంచి వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు చాట్ చేయగానే అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. అందులో రిజిస్టర్ కంప్లైంట్ ఎంటర్ చేయగానే విత్ యూనిక్ సర్వీస్ నంబర్, విత్ అవుట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెను వస్తుంది. ఇలా విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయగానే వినియోగదారుడి సర్వీస్ వివరాలు వస్తాయి. ఈ వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్‌కు సంబంధించిన వివిధ రకాలు మెనులో కనపిస్తాయి. ఇందులో కంప్లైంట్‌కు సంబంధించి సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ వస్తుంది. ఇలా ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు లేదా కంప్లైంట్ నమోదు చేయొచ్చు.
ఎల్‌సీ యాప్..
విద్యుత్ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఎల్‌సీ యాప్‌ను ప్రవేశపెట్టారు. మరమ్మతుల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు, పునరుద్ధరణకు సమాచారం ఇచ్చేందుకు ఎల్‌సీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్‌సీయాప్ ద్వారా మానవతప్పిదాలకు అవకాశముండదు. తద్వారా విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయి.