
బీసీల్లో సామాజిక విప్లవం వస్తుంది
కేయూ క్యాంపస్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పాలకులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని, ఆ వాటా సాధించుకునేందుకు బీసీల్లో సామాజిక విప్లవం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ పూలే ఆశయ సాధన సమితి (పాస్), నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎన్‌బీసీడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యకేంద్రంలో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్స్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రసాధన తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు న్యాయం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామన్నారు. ఆ పార్టీ బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉపక్రమించిందన్నారు. అయితే బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం మూడునెలలుగా ఆమోదించకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ బీజేపీ తోడుదొంగలేనన్నారు. బీఆర్‌ఎస్‌కు బీసీలపై ప్రేమ ఉంటే కరీంనగర్‌లో 8న జరగబోయే బీఆర్‌ఎస్ బీసీ శంఖారావం సభకు ముందు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్‌బీసీడబ్లూఏ బాధ్యుడు చలమల్లా వెంకటేశ్వర్లు, ‘పాస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగనిమల్లేశ్వర్, రాష్ట్ర ఉద్యమకారులవేదిక చైర్మన్ కె. వెంకటనారాయాణ, ‘కుర్తా’ జనరల్ సెక్రటరీ వడ్డెరవీందర్, ‘పాస్’ జిల్లా అధ్యక్షుడు శాస్త్రి, వివిధ సంఘాల బాధ్యులు బాబుయాదవ్, చందా మల్ల య్య, గడ్డం కృష్ణ, ఆకుతోట శ్రీనివాస్, తిరునహరిశేషు, తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సదస్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాలని సదస్సు తీర్మానించింది. ఆ లేఖను రాష్ట్రపతికి ట్విటర్ ద్వారా పంపినట్లు సంగని మల్లేశ్వర్ తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్