
పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వివిధ అంశాలపై కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరద ముంపు నివారణలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు వద్ద నిర్మిస్తున్న నాలా పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వనమహోత్సవంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి అవసరమైన చర్యల్లో వేగం పెంచాలని తెలిపారు. భద్రకాళి పూడికతీత పనులపై సంబంధిత అధికా రులు చొరవ చూపాలన్నారు. పైడిపల్లి, వర్ధన్నపేటల్లో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు
వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. పాఠశాలలు, వసతిగృహాల్లో అధికారుల సందర్శన, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వనమహోత్సవం, విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు, తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సమీక్షించారు. గురుకుల పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టె ఉండేలా పర్యవేక్షిస్తూ మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్ల సహకారంతో పరిశీలించాలన్నారు.