
విశ్లేషణాత్మక వార్తలు రాయాలి
ఖిలా వరంగల్: జర్నలిస్టులు విశ్వసనీయతతో కూడిన విశ్లేషణాత్మక వార్తలు మాత్రమే రాయాలని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. వరంగల్ కరీమాబాద్ ఉర్సు గుట్ట సమీపంలోని తాళ్లపద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజు లుగా జరుగుతున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నిజనిర్ధారణ అనేది జర్నలిజంలో ఒక ముఖ్యమైన భాగమని, జర్నలిస్టులు కచ్చితంగా నిజాలను నిర్ధారించుకున్న తర్వాతే నిర్బయంగా వార్తలు రాయాలన్నారు. వృత్తిపరమైన నియమాలను పాటించాలన్నారు. భవిష్యత్‌లో పత్రికల నిర్వహణలో ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషించనుందన్నారు. అనంతరం జెడ్పీ సీఈఓ రామిరెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు పక్షపాతం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ వార్తలు సేకరించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలన్నారు. సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరావు, మేనేజర్ శైలేష్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు తోట భావనారాయణ, ఉడుముల సుధాకర్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ)వరంగల్ అధ్యక్షుడు శ్రీరామ్‌రాంచందర్, ప్రధాన కార్యదర్శి మట్ట దుర్గా ప్రసాద్, డీపీఆర్‌ఓ ఆయూబ్ అలీ, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్లమల్లేశం, డైరెక్టర్ వరుణ్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యంపై ముగిసిన శిక్షణ